అంతర్గ ప్రజాస్వామ్యం లోపిస్తే  ముప్పు

రాజ్యాలు పోయి రాజులు పోయినా ప్రజాస్వామ్యంలో ఇంకా రాచరిక పోకడలు పోలేదు. పెత్తందారీ వ్యవస్థ రద్దు కాలేదు. రాజులు చలాయించినట్లుగానే ఇప్పటికీ అధినేతలు తమ కనుసన్నల్లో పాలన సాగిస్తున్నారు. పెత్తనం ఏకవ్యక్తి చేతుల్లో నడుస్తోంది. ప్రజాస్వామ్మ స్ఫూర్తి కొరవడింది. తాము తీసుకున్న నిర్ణయాలను మమ అనిపించి అమలు చేస్తున్నారు. ప్రధాని మొదలు ముఖ్యమంత్రుల వరకు ఇదే తరహా పాలన సాగుతోంది. ప్రజాస్వామ్య ముసుగులో రాజరిక పాలన సాగుతోంది. ఏకవ్యక్తి నిర్ణయాలు అమలువు తున్నాయి. దీంతో ప్రజల ఇష్టాఇష్టాలు, బాగోగుల గురించిన చర్చ జరగడం లేదు. ఎక్కడో తమకొచ్చిన ఆలోచనలను అధికారులతో చర్చించో లే చర్చించకుండానే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయి లో వాటి పనితీరు అధ్యయనం చేయడం లేదు. ఎంతో గొప్పగా మన గణతంత్రాన్ని కీర్తిస్తూ, మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పొగుడుకుంటూ స్వాతంత్య్రం సిద్దించాక రూపొందించు కున్న మన రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా పాలన సాగుతున్న తీరు అపహాసం అవుతోంది. ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఈ రాజచరిక వ్యవస్థ ఆనవాళ్లు ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల నేతలే అసలు సిసిలు రాజులుగా ఉంటున్నారు. వారిని ఎదరించి నిలబడే దైర్యం పార్టీల నేతలుకు లేదు. అంతే గాకుండా ప్రశ్నించే తత్వాన్ని కూడా భరించలేనంతగా నిరంకుశ విధానాలు సాగుతున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యంలో కూడా బలవంతులదే పెత్తనంగా మారింది. డబ్బున్నోళ్లదే రాజ్యంగా నడుస్తోంది. వారి ఆలోచనల మేరకే పాలన సాగుతోంది. పేదలుపేదలుగానే ఉంటున్నారు. పెద్దలు మరింత బలిసి పోతున్నారు. వీరే రాజ్యాధి కారం చిక్కించుకుని తమకు అనుకూలంగా పాలన చేస్తున్నారు. ప్రధానంగా బిజెపి లాంటి పార్టీలో కూడా అంతర్గ ప్రజాస్వామ్యం లోపించింది. ప్రధానిగా మోడీ పగ్గాలు చేపట్టిన తరవాత ఏకవ్యక్తి  ఛత్రంలోకి పార్టీ వెళ్లింది. సీనియర్లు అద్వానీ, మురళీమనోహర్‌ జోషి,యశ్వతం సిన్హా, అరుణ్‌ శౌరి లాంటి వారికి మాట్లాడే అవకాశం లేదు. కనీసంగా పార్టీలో వారికి ప్రవేశం కూడా లేకుండా చేశారు. దీంతో అంతర్గతంగా సమస్యలను చర్చించడానికి అవకాశం లేకుండా పోతోంది. ఇది ప్రజల సమస్యలను గుర్తించే అవకాశం లేకుండా చేసింది.  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావు. ధరలు పెరుగుతున్నా తగ్గించే మార్గాలు చూడరు. విద్యవైద్యం వంటి వారికి ఇంకా భరోసా లేదు. అదే పేదల వైద్యానికి గ్యారెంటీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేదు. గ్రావిూణ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. మొన్నటికి మొన్న నోట్ల రద్దుతో ప్రజలను రోడ్డుకు ఈడ్చారు. తాజాగా నోట్ల రద్దు వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ పేదలకు వ్యతిరేకంగా జరిగినవే తప్ప మరోటి కాదు. ప్రజలను గండాల నుంచి గట్టెక్కించే బదులు మరో గండంలోకి నెట్టేలా చర్యలు ఉంటున్నాయి. అంటే మన గణతంత్రం కొందరు పెద్దలు తీసుకున్న నిర్ణయాలపైన ఆధారపడి నడుస్తోంది. భవిష్యత్‌ అంటే భరోసా లేకుండా పోతోంది. ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వస్తూత్పత్తి తగ్గి దిగుమతులు పెరిగాయి. వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే దుస్థితి నెకొంది. కల్తీ సామ్రాజ్యం ఏలుతోంది.  ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో భవిష్యత్‌పై భరోసా లేకుండా పోతోంది. వచ్చే పదేళ్ళొ, 20 ఏళ్ళకో ప్రణాళికలు అంటున్నా అవి కార్యాచరణ దాల్చడం లేదు. మన తర్వాతి తరాలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఇవ్వలేకపోతున్నాం. కాలుష్యం పెరిగి పోతోంది.  ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చామో… ఏం సాధించామో విశ్లేషించుకుంటే భవిష్యత్‌ గురించి ఆలోచించగలుగుతాం. గతాన్ని అర్థం చేసుకుంటేనే భవిష్యత్‌ను చూడగలుగుతాం. నాగరికమనుకునే
గతంలోకి చూసి… మరింత నాగరికమైన భవిష్యత్‌నెలా నిర్మించగలం? అన్నది మరచి అనాగరిక ప్రపంచాన్ని పెంచి పోషించేలా పాలకుల నిర్ణయాలు ఉంటున్నాయి. మా తరవాత ఎవరు ఏమైపోతే ఏంటన్న దృష్టిలో పాలకులు ఉన్నారు. ఓటుబ్యాంక్‌ రాజకీయాలు దేశాన్ని దివాళా తీయిస్తున్నాయి.  పేదరికం, పర్యావరణం, ప్రజా భద్రత.. ఇలా ప్రతిదాంట్లో మనం మానవులుగా విఫలమయ్యాం. తప్పుడు జీడీపీ లెక్కలతో అభివృద్ధిని అంకెల్లో చూసుకుంటున్నాం. ప్రతి మనిషికీ కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించగలుగుతున్నామా అన్నది ఆలోచన చేయడం లేదు. మహిళలు నేటికీ స్వేచ్ఛగా జీవించే అవకాశాలు లేకుండా విచ్చలవిడిగా తయారయ్యింది. నేరస్థులకు భయం లేకుండా పోతోంది. గంజాయి పారుతోంది. ప్రభుత్వాలే మద్యాన్ని బలవంతంగా అమ్మిస్తున్నారు. మహిళా బిల్లుకు మోక్షం లేకుండా పోయింది.  నిజంగా ప్రగతి సాధించాలంటే- తొలుత అందరికీ భౌతిక, భద్రత అవసరాలను తీర్చాలి. ఆ తర్వాత- మిగిలినవాటి గురించి మాట్లాడొచ్చు. సెల్‌ఫోన్లు, కార్లు, కోట్ల డబ్బులుండాలి… పట్టణాల్లో బతకాలనే ఆలోచనల్ని అందరిపైనా రుద్దుతున్నారు. అంతిమంగా  తమ ప్రజలు సంతృప్తితో.. సంతోషంగా ఉండాలని కోరుకున్నప్పుడే ప్రజారంజక పాలన సాగించిన వారు అవుతారు. అందుకు అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలి. పార్టీలో ప్రజా సమస్యలపై చర్చ చేయాలి. అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయాలు ఉండాలి. క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకుని పార్టీలో చర్చించడం ద్వారా ప్రజాభిప్రాయానికి పార్టీల అధినేతలు పెద్దపీట వేయాలి.