అంతర్జాతీయ క్రికెట్‌లకు డీ విలియర్స్‌ గుడ్‌బై

సడన్‌గా షాకిచ్చేలా రిటైర్‌మెంట్‌ ప్రకటన
ఇక ఆడలేనని తేల్చిన స్టార్‌ బ్యాట్స్‌మెన్‌
కేప్‌టౌన్‌,మే23( జ‌నం సాక్షి):  సౌతాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ సడెన్‌ షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. 34 ఏళ్ల డివిలియర్స్‌ సౌతాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నా. 114 టెస్టులు, 228 వన్డేలు ఆడాను. ఇక యువకులు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. నేను చాలా అలసిపోయాను. ఇది చాలా కఠిన నిర్ణయమని తెలుసు. చాలా రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. మంచి ఫామ్‌లో ఉన్నపుడే తప్పుకోవాలని అనుకున్నానని అన్నాడు.  ఇండియా, ఆస్టేల్రియాలపై సిరీస్‌లు గెలిచిన తర్వాత రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించాను అని డివిలియర్స్‌ చెప్పాడు. 14 ఏళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన కోచ్‌లు, ఇతర సపోర్టింగ్‌ స్టాఫ్‌కు ఏబీ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక నా టీమ్‌ మేట్స్‌కు చాలా పెద్ద థ్యాంక్స్‌. ఎందుకంటే వాళ్ల మద్దతు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు. సంపాదించడం పక్కనపెడితే నేను బాగా అలసిపోయాను. ఇక నావల్ల కాదు అనిపించింది. నా నిర్ణయాన్ని అర్థం చేసుకునే అభిమానులకు కృతజ్ఞతలు. విదేశాల్లో ఆడే ఆలోచన కూడా నాకు లేదు. అయితే దేశవాళీ క్రికెట్‌లో టైటన్స్‌ టీమ్‌కు మాత్రం ఆడతాను అని డివిలియర్స్‌ స్పష్టంచేశాడు.  ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ టీమ్‌కు ఏబీ ఆడిన విషయం తెలిసిందే. అతను చెప్పిన దాని ప్రకారం ఏబీ ఇక ఐపీఎల్‌కూ దూరమైనట్లే. క్రికెట్‌లో మిస్టర్‌ 360గా ఏబీకి పేరుంది. గ్రౌండ్‌ నలుమూలలా షాట్లు ఆడగల సత్తా ఏబీ సొంతం. కొత్త కొత్త షాట్లను అతను క్రికెట్‌కు పరిచయం చేశాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా క్రికెట్‌లో అతనికి ప్రత్యేక స్థానం ఉంది. 2015 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా టీమ్‌ కెప్టెన్‌ డివిలియర్సే. ఆ టోర్నీలో సఫారీలు సెవ్గిూ/నైల్‌ వరకు వచ్చారు. అందులోనూ ఏబీదే కీలకపాత్ర. ఆ వరల్డ్‌కప్‌లో 96 సగటుతో 482 పరుగులు చేశాడు.  క్రికెట్‌లో డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (16 బాల్స్‌), ఫాస్టెస్ట్‌ సెంచరీ (31 బాల్స్‌), ఫాస్టెస్ట్‌ 150 (64 బాల్స్‌) రికార్డులు ఏబీ పేరిటే ఉన్నాయి. సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్ట్‌ స్కోరు (278 నాటౌట్‌) కూడా అతని పేరిటే
ఉంది. ఇక ఐసీసీ టెస్ట్‌ ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు (935) సాధించిన సౌతాఫ్రికా క్రికెటర్‌ కూడా అతడే. 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 రన్స్‌ చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు చేశాడు. అందులో 25 సెంచరీలు, 53 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అయితే ఎన్ని రికార్డులు ఉన్నా.. వరల్డ్‌కప్‌ అందుకోవాలన్న అతని కల మాత్రం కలగానే మిగిలిపోయింది.