అంబేడ్కర్‌ ఆశయసాధనలో కెసిఆర్‌

రాజ్యంగ నిర్మాతకు ఎర్రబెల్లి నివాళి

వరంగల్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి); భారత రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అంబేద్కర్‌ కేవలం దళితులకు చెందిన వ్యక్తి మాత్రమే కాదు, ఆయన అందరి వాడన్నారు. న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞశాలిగా కీర్తించబడ్డారన్నారు. అంబేద్కర్‌ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని ప్రశంసించారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలని మొదట పోరాటం చేసింది అంబేద్కర్‌ అనే విషయాన్ని గుర్తు చేశారు. మొదటి న్యాయ శాఖ మంత్రి అయ్యాక దళితులకు రిజర్వేషన్లు కల్పించింది కూడా బాబాసాహెబ్‌ అని కొనియాడారు. ఈ రోజు మనం ఈ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామంటే..ఆ పుణ్యం అంబేద్కర్‌దే అన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నాడని పేర్కొన్నారు. రూ.10 వేల కోట్లతో రాష్ట్రంలోని దళిత వాడల అభివృద్ధి చేస్తామన్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమే దళిత బంధు పథకమన్నారు. కార్యక్రమంలో హన్మకొండ జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌ కుమార్‌, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.