అక్రమ దందాకు కేరాఫ్ అడ్రస్ రిటైర్డ్ డెప్యూటీ ఎమ్మార్వో ఇల్లు

కమలాపూర్ : అతనో రిటైర్డ్ డెప్యూటీ తహశీల్దార్. అయితేనేమీ పాత పరిచయాలతో ఇప్పటికీ రెవెన్యూపరమైన పనులను తన ఇంట్లోనే చక్కబెడుతున్నాడు. ఫోర్జరీ సంతకాలతో పాసుపుస్తకాలు జారీ చేస్తున్నాడంటూ ఆర్డీవోకు అందిన ఫిర్యాదు మేరకు అతని బండారం బట్టబయలైంది. రెవెన్యూ అధికారుల కథనం మేరకు.. కమలాపూర్‌కు చెందిన కోవెల భిక్షేందర్‌స్వామి హుజూరాబా ద్, శంకరపట్నం, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలా ల్లో రెవెన్యూశాఖలో పని చేశారు. ఇటీవలే భీమదేవరపల్లి డెప్యూటీ తహశీల్దార్‌గా రిటైర్డ్ అయ్యారు. అయినా రెవెన్యూ పరమైన పనులను కమలాపూర్‌లోని తన ఇంట్లోచే చక్కబెడుతున్నాడు. ఈ క్రమంలోనే భిక్షేందర్‌స్వామి ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు తయారు చేసి జారీ చేస్తున్నాడంటూ ఇటీవల కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో భిక్షేందర్‌స్వామి ఇంట్లో తనిఖీలు నిర్వహించాలని వీణవంక, కమలాపూర్ తహశీల్దార్‌లను ఆర్డీవో ఆదేశించారు.

శనివారం రెవెన్యూ అధికారులు భిక్షేందర్‌స్వామి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. శంకరపట్నం, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుజూరాబాద్ మండలాలకు చెందిన 38 పాసు పుస్తకాలు లభించాయి. అలాగే ఆర్వోఆర్, విరాసత్ ఫైళ్లు 13, జమాబందీ ఫైళ్లు 14, ప్ర భుత్వ భూముల అసైన్‌మెంట్ దరఖాస్తులు 13, వివిధ మండలాలకు చెందిన 38 పాసు పుస్తకాల జిరాక్స్‌లు ల భ్యమయ్యాయి. తనిఖీల సమయంలో భిక్షేందర్‌స్వామి అందుబాటులో లేరని, స్వాధీనం చేసుకున్న రికార్డులు సీజ్ చేసి కమలాపూర్ తహశీల్దార్‌కు అప్పగించామని, తనిఖీ పూర్తి నివేదికను ఆర్డీవోకు నివేదిస్తామని వీణవంక తహశీల్దార్ భావుసింగ్ తెలిపారు. ఈ తనిఖీల్లో తహశీల్దార్ అనంతుల రవీందర్, ఆర్‌ఐలు రజని, నెహ్రూ, సదానందం, వీఆర్వోలు సదానందం, రవీందర్‌రావు, వీఆర్‌ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.