అక్షరాన్ని బతికించుకోవాలి

 

దేశ భాషలందు తెలుగు లెస్స…అని కృష్ణదేవరాయలు అన్న పలుకు నిజంగానే ఆర్దత్ర కలిగి ఉంటుంది. తెలుగు అంటే అమ్మభాష. అమ్మభాషలో మాట్లాడుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. దూరప్రాంతాలకు వెళ్లి మనవారు ఎవరైనా కలిస్తే మాట్లాడుకుంటే వచ్చే ఆత్మీయత అంతా ఇంతాకాదు. అలాంటి మనభాషను దూరం చేసుకోవడం అంటే ఎంతటి బాధ ఉంటుందో చెప్పలేం. మాతృభాష ప్రజల అన్ని అవసరాలనూ తీర్చగలగాలి. అప్పుడే దానికి మనుగడ. అన్ని కార్యాలయాల్లో ప్రజలు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, సంభాషణలు తెలుగులోనే జరపడం వల్ల భాష పట్ల గౌరవం పెరుగుతుంది. మనం మాట్లాడున్నంత కాలం అక్షరం కలకాలం వెలుగు లీనుతుంది. మన ఇంట్లోనే మవ్మిూ డాడీ అంటూ మొదలు పెడితే ఆందోళన చెందినట్లుగానే అది అంతమొందుతుంది. భాషకు అధికారిక ¬దా ఇచ్చి, అన్నిటా దానికి చెల్లుబాటు పెంచగలిగితే అది ఎల్లకాలం బతుకుతుంది. తెలుగు వెలుగు లీనటానికి నిరంతర చర్యలు తీసుకోవాలి. ఇంగ్లీష్‌ నేర్చుకుంటూనే తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి కావాలి. అప్పుడు మన భాషకు చావులేదు. తెలుగులో మాట్లాడడం, తెలుగులో రాయడం అన్నది గౌరవం గా స్వీకరించాల్సిన సమయమిది. పరభాషలు నేర్చుకుని ఉద్యోగాలు సంపాదించడంలో తప్పు లేదు కానీ మన భాషను వెక్కింరించుకుంటే అమ్మను తిట్టుకోవడమే అవుతుంది. అమ్మల నుంచే ఈ మార్పు రావాలి. ఇంట్లో తప్పనిసరిగా తెలుగు మాట్లాడుకోవడం, తెలుగు అక్షరాలను నేర్పడం, పదాలను నేర్పడం చేయాలి. ఇంగ్లీషుపై తాపత్రయం ఉన్నా.. తెలుగుపై మమకారం వీడరాదు. అమెరికాలాంటి దేశాల్లో స్థిరపడ్డ మన వారు అక్కడ తెలుగుకోసం ఎంతగా తాపత్రయ పడుతున్నారో వారిని చూసి నేర్చుకోవాలి. వారు తమ పిల్లలకు తెలుగుతో పాటు లలితకళలను కూడా నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాష కోసం తాపత్రయ పడాలి. మనభాషలో చక్కగా మాట్లాడుకోవాలి. ఇటీవలి కాలంలో తెలుగుభాష పట్ల చులకన భావం ఏర్పడింది. ఆంగ్లంలో మాట్లాడితేనే ¬దా గౌరవం అన్న రీతిలో మన చదవులు సాగుతున్నాయి. ప్రపంచ గమనంలో మనం కూడా విదేశీ భాషలు నేర్చుకుని ముందుకు సాగడంలో అభ్యంతరం లేదు. అలా అని అమ్మభాషను మరచిపోవడం, అక్షరాలే తెలియకుండా పెరగడం మాత్రం మంచిది కాదు. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు భాష మనుగడ గురించి, ప్రాంతీయ అస్తిత్వాల ప్రాధాన్యం గురించి చర్చలు జరుగుతున్నాయి. తెలుగు ఇంతగా పరిఢవిల్లుతున్న నేలలో మరి ఎందుకని తెలుగు భాష మనుగడ గురించి కలవర పడుతున్నాం. మనభాష అంతమై పోతుందన్న భావనలో ఎందుకో ఏళ్ల తరబడి చర్చోప చర్చలు జరుపుతున్నాం. బతుకుకు భరోసా ఇచ్చేది భాషనే. ఇంగ్లీషే నేర్చుకోవద్దని ఎవరూ అనడం లేదు. ఆంగ్ల మోజులో తెలుగు రాదని చెప్పుకోవడమే దౌర్భాగ్యం కాగలదు. ఇంగ్లీషు విూడియంలో చదువుకున్న వాళ్ళకు ఉద్యోగావకాశాలు పెరగటం, తెలుగు మాధ్యమం నిరుపయోగం అనే భావం విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో గట్టిగా స్థిరపడడడం దీనికి ప్రధాన కారణం. అది ఇప్పటికీ తారస్థాయికి చేరుకుంది. ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లీషులో చదువు నేర్పటం అవసరమనే భావన బలంగా పెరిగింది. అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ మాతృభాషలో తప్ప ద్వితీయ భాషలో పాఠశాల విద్య నేర్పటం లేదు. ప్రయివేటు విద్యా సంస్థలు తామర తంపరగా మొదలై, తరువాత కార్పొరేట్‌ సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి ఒత్తిడి, ప్రభావం మొత్తం విద్యా వ్యవస్థనే తలకిందులు చేసింది. తెలుగులో విద్యాబోధన అనేది ఒక పనికిరాని పక్రియ అయిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంతకాలానికి తెలుగు భాష వినిపిస్తూ ఉండొచ్చు కానీ, తెలుగు అక్షరం అదృశ్యం అయిపోతుందని భాషా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంగ్లం లేదా ఇతర భాషల్లో ఎంతగా పట్టు సాధించాలని తల్లిదండ్రులు తమ పిల్లలను రుబ్బు తున్నారో తెలుగులో కూడా అలాగే రుబ్బాలి. అందుకు క్షేత్రస్థాయిలోనే బీజం పడాలి. మన విద్యావిధానాన్ని సమూలంగా సంస్కరించు కోవాలి. ఇంగ్లీషు విూడియం చదువు కొనసాగిస్తున్నా.. అంతేస్థాయిలో మాతృభాష ద్వారా అన్ని స్థాయిల్లోనూ విద్యాబోధన జరగాలి. ఇంగ్లీషును నేర్చుకోవద్దని, నేర్పవద్దని ఎవరూ కోరుకోవడం లేదు. మాతృభాషలో బోధన ఉన్నంతవరకు చదువులపై పట్టు పెరుగుతుంది. సాహిత్యం ద్వారా అమ్మభాష నిరంతరం వికసించే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. ఎంతోమంది మహామహులు తెలుగు భాషా వికాసానికి గొప్ప సూచనలూ, మార్గదర్శకాలు రూపొందించి ఇచ్చారు. వాటిని పరిశీలించి, ఆవశ్య మైనవాటిని అమల్లోకి తేవటానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పూనుకోవాలి. దానికోసం సాహిత్య, భాషావేత్తల తో ఒక యంత్రాంగం ఏర్పాటు చేయాలి. ఆంగ్లం అన్నది కేవలం భాషాపరంగానే చూడాలి. ప్రస్తుతం ఆంగ్లానికి ఇస్తున్న ప్రాధాన్యం స్థాయిలో తెలుగులో కూడా క్షేత్రస్థాయి నుంచే బోధన సాగితే పిల్లలకు రెండుభాషలపైనా పట్టు పెరుగుతంది. రెండు భాషల్లో ప్రావీణ్యం సాధించేలా బోధన జరగాలి. విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక విషయూలకు సంబంధించి ఆంగ్లంలో బోధన మంచిదే. పిల్లలకు పాఠశాలస్థాయి నుంచి తెలుగులో కథారచన, వక్తృత్వం, సాహిత్య బోధన వంటివి చేపట్టాలి. మాతృభాష వికసించి, పరిమళించాల్సిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సైతం ఆంగ్ల మాధ్యమం ప్రవేశించింది. తెలుగులో కోర్టు తీర్పులు, పాలనలో తెలుగు వాడుక వంటివి కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు తప్ప సమూలమైన మార్పు సాధ్యం కావడంలేదు. తెలుగు కేవలం సాహిత్య భాషగా ఉంటే అది పుస్తకాలకే పరిమితం అవుతుంది. తెలుగు సాహిత్యం ద్వారా మన సంస్కతిని తపస్పనిసరిగా బోధిస్తూనే ఆంగ్లంలో కూడా పట్టు సాధించేలా బోధానా విధానాలు రూపొందించుకోవాలి. అందుకు మన ఇంటి నుంచే విప్లవం రావాలి.