అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు

ఎలమెంటరీ పాఠశాలలో దుండగుడి కాల్పులు
యువకుడి విచ్చలవిడి కాల్పుల్లో 21మంది మృతి
మృతుల్లో 19మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తింపు
ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురైన అధ్యక్షుడు జో బైడెన్‌
ఇలాంటి నరేమేధాలకు ఇక స్వస్తి పలకాలన్న కమలా హ్యారిస్‌
టెక్సాస్‌,మే25(జ‌నంసాక్షి): అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు. మృతి చెందిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెక్సికన్‌ సరిహద్దులోని ఉవాల్డే నగరంలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన ఘటన ఇదేనని రాష్ట్ర గవర్నర్‌ గ్రేగ్‌ అబాట్‌ పేర్కొన్నారు. కాల్పుల నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కాల్పులు జరిపింది 18 ఏళ్ల టీనేజర్‌గా పోలీసులు గుర్తించారని గవర్నర్‌ తెలిపారు. అంతేగాక పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతి చెందినట్లు గవర్నర్‌ స్పష్టం చేశారు. కాగా, 2018లో ప్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్‌ విద్యార్థులతో సహా ముగ్గురు టీచర్లు మృతిచెందారు. ఈ ఘటన తర్వాత అగ్రరాజ్యంలో ఇదే అత్యంత దారుణ సంఘటనగా పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిజేశారు. దేశంలోని గన్‌ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులకు పిల్లలు శాశ్వతంగా దూరం కావడం అంటే.. అది వాళ్ల గుండెకు మాయని గాయమని, కొంతకాలం వరకు కోలుకోలేని క్షోభ అంటూ బైడెన్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కారు ప్రమాదం రూపంలో తనకు దూరమైన మొదటి భార్య, కూతురిని అధ్యక్షుడు గుర్తు చేసుకున్నారు. అటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఇక చాలని.. ఇకపై ఇలాంటి వాటికి చోటు ఇవ్వకూడదని పేర్కొన్నారు. దేశం మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె తెలిపారు. మన గుండెలు బద్ధలు అవుతూనే ఉన్నాయి. చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయాలి అని కమలా చెప్పు కొచ్చారు. సల్వడార్‌ రామోస్‌ అనే 18 ఏండ్ల యువకుడు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉవాల్డేలోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లోకి ప్రవేశించాడు. తనవెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో 21 మంది అక్కడికక్కడే చనిపోగా, పలువురు గాయపడ్డారని తెలిపారు. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ స్కూల్‌ను చుట్టుముట్టారని, వారు జరిపిన కాల్పుల్లో గన్‌మ్యాన్‌ కూడా చనిపోయాడని వెల్లడిరచారు. కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.