అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రీకొడుకులు

తిరుమలగిరిలో బాలిక ఆత్మహత్య
ఆందోళనకు దిగిన బంధువులు
నల్లగొండ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): జిల్లాలోని నాంపల్లి మండలం తిరుమలగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి ఓ బాలిక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని ఏడు నెలల గర్భవతిగా గుర్తించారు. బాలిక మృతిని నిరసిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాలిక మృతికి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులే కారణమని ఆరోపించారు. భూతం శ్రీను, అఖిల్‌ ఇరువురి ఇంటిముందు బాలిక మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. తండ్రీ, కొడుకుల చేతిలో అఘాయిత్యానికి గురైన ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక (16) కూలి పనులకు వెళుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన భూతం శ్రీను, ఆయన కుమారుడు (15) కొన్నాళ్లుగా సదరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. గురువారం బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దేవరకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేయించగా ఏడు నెలల గర్భవతిగా తేలింది. దీంతో వారు గ్రామానికి వచ్చి నిందితులను నిలదీయగా అబార్షన్‌
చేయించుకోవాలంటూ బాలికకు సూచించి రూ.5వేలు ఇచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం ఆ బాలిక ఆమె అమ్మమ్మతో కలసి దేవరకొండలోని ఆసుపత్రికి వెళ్లగా అక్కడ అబార్షన్‌కు వారు నిరాకరించారు. అనంతరం గ్రామానికి వచ్చిన బాలిక తల్లిదండ్రులతో కలసి అఘాయిత్యానికి పాల్పడిన తండ్రీకొడుకును నిలదీసింది. తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇష్టమొచ్చింది చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాలిక శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగింది. ఇది గమనించి బంధువులు హుటాహుటిన ఆమెను నల్గొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శనివారం ఉదయం బాలిక మృతదేహాన్ని నిందితుల ఇంటిముందు ఉంచి బంధువులు ధర్నాకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘటనపై విచారణ జరుపుతున్నారు.