అడవిపందుల దాడితో పంటలకు నష్టం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో అడవి పందుల బెడద రైతులను కంటివిూద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చే పంటలను పందుల మంద ధ్వంసం చేస్తోంది. ప్రధానంగా మక్కపంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంటల రక్షణతో పాటు ప్రమాదాలను నివారించడానికి అటవీశాఖ అధికారులు
పంటలపై దాడి చేస్తున్న అడవి పందులను కాల్చివేతకు చర్యలు చేపట్టారు. పందుల బారి నుంచి పంటలను కాపాడు కునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో రైతులు వేరుశనగ, శనగ, జొన్న పంటలను సాగు చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటలపై అడవి పందులు దాడి చేసి నాశనం చేస్తున్నాయి. ఫలితంగా రైతులు పంటలను నష్టపోతున్నారు. దీంతో రైతులు పంటలకు విద్యుత్తీగలను అమర్చుకుంటుండగా ప్రమాదాలు జరుగుతున్నాయి.