అడవుల రక్షణకు కఠిన చర్యలు

కబ్జాలపై ఉక్కుపాదం మోపాల్సిందే
కలెక్టర్లు, మంత్రులకు సిఎం కెసిఆర్‌ స్పష్టీకరణ
సింగరాయిపల్లి సామాజిక ఫారెస్ట్‌ తనిఖీs
హైదరాబాద్‌,ఆగస్ట్‌21( (జనంసాక్షి):  అడవుల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని మంత్రులు, అధికారులకు సిఎం కెసిఆర్‌ స్పష్టమైన ఆదేవాలు ఇచ్చారు. కలెక్టర్లతో సమావేశాల్లో భాగంగా బుధవారం రెండోరోజు ఉదయం హైదరాబాద్‌ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి మంత్రులు, అధికారులు, కలెక్టర్లతో కలిసి గజ్వేల్‌ లోని కోమటిబండకు వెళ్లారు. మార్గమధ్యలో.. సింగాయిపల్లి ఫారెస్ట్‌ బ్లాక్‌లో ఆగారు. అక్కడ అడవుల పరిరక్షణ ఆక్రమణలపై అధికారులతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఆక్రమణలు అడ్డుకునేందుకు చర్యలు ఏం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అందుకు వన సంరక్షణపై ప్రచారం , అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని అధికారులు, మంత్రులు వివరణ ఇచ్చారు. ఐతే దీనిపై సీఎం కేసీఆర్‌ ఒకింత సీరియస్‌ గా స్పందించారు. ఇది నా నియోజకవర్గం. ఇక్కడేం జరుగుతుందో చూస్తూనే ఉన్నా. 15రోజులకు ఒకసారి వస్తూ పోతూ చూస్తునే ఉన్నా. ఇక్కడేం జరుగుతుందో నాకూ తెలుసు. అడవులు, అటవీ భూములు కబ్జా కాకుండా చూడటం, వాటి సరిహద్దులు గుర్తించడం చాలా ముఖ్యం. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా ఈ పని చేయాలని కేసీఆర్‌ చెప్పారు. హరితహారంలో భాగంగా చేపట్టిన మొక్కల పెంపకం, వాటి ఫలితాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రులు, అధికారుల బృందం సిద్దిపేట జిల్లాకు బయల్దేరింది. సీఎం సహా మంత్రులు, కలెక్టర్లు హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ నుంచి బస్సుల్లో బయల్దేరి వర్గల్‌ మండలం సింగాయిపల్లికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో 2016-17లో చేపట్టిన అటవీ పునరుజ్జీవన పనులను పరిశీలించారు.  గజ్వేల్‌, కోమటిబండ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన సామాజిక వనాలను పరిశీలించారు. అలాగే కోమటిబండ  గుట్టపై  నిర్మించిన  మిషన్‌  భగీరథ పంపుహౌస్‌ను  సందర్శించారు.  కోటి 40 లక్షల  లీటర్ల  సామర్థ్యంతో నిర్మాణమైన ఈ భారీ పంప్‌ హౌస్‌ నుంచి 456  గ్రామాలకు  ప్రతిరోజూ  తాగునీరు  సరఫరా  జరుగుతోంది. 5 ఎకరాల్లో  నిర్మించిన  భగీరథ  కేంద్రాన్ని  మంత్రులు,  కలెక్టర్లు, ఉన్నతాధికారులతో  కలిసి  పరిశీలించారు. పథకం  పనితీరును వివరించనున్నారు. సీఎం రాక సందర్భంగా కోమటిబండలో అధికారులు అన్ని ఏర్పాట్లు  చేశారు.  పంప్‌ హౌస్‌ వరకు  ప్రత్యేక రోడ్డు  నిర్మించారు.  పంప్‌  హౌస్‌  దగ్గర  కొత్తగా  నిర్మించిన మిషన్‌  భగీరథ  నాలెడ్జ్‌  సెంటర్‌ ను  సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. కోమటిబండ ప్రాంతంలో పోలీసు  అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  .