అతలాకుతలమే హెచ్‌1బీని టచ్‌ చేస్తే..

636177165140536104కంపెనీల్లో ఆందోళన మొదలైంది. తాను అధ్యక్షుడయ్యాక మొదటి 100 రోజుల్లో అమెరికన్లకు ఉద్యోగాల సృష్టికి చర్యలు చేపడతానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక అన్నంతపనీ చేస్తే భారతకు ఏమవుతుంది? ఉద్యోగం కోసం విదేశాల నుంచి వచ్చే వారిని నియంత్రించడం వల్ల అమెరికా ఏ మేరకు లాభపడుతుంది? అధ్యక్ష ఎన్నికలబరిలో దిగినప్పటి నుంచి ట్రంప్‌ అక్కడి ఓటర్లకు ప్రధానంగా ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది హెచ్‌1బీ వీసాల కఠినతరం. పలు కంపెనీలు స్థానికులను తొలగించి.. విదేశీ ఉద్యోగులను తెచ్చుకుని తక్కువ జీతాలతో పని చేయించుకుంటున్నాయని.. తాను గెలిస్తే అధ్యక్షుడైన 100 రోజుల్లోపు ఈ తీరును మార్చుతానని ప్రకటించాడు. గెలుపు అనంతరం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల పట్లా సానుకూలంగా మాట్లాడిన ట్రంప్‌.. ఇప్పుడు క్రమంగా గేర్‌ మార్చుతున్నాడు.

ఆంక్షలొస్తే మనకేంటి!

ఐటీ సేవల రంగంలో మనం ముందంజలో ఉన్నాం. ఈ రంగం ఏటా పది శాతం వృద్ధి చెందుతుండగా లక్షల కుటుంబాలు వీటిపై ఆధారపడి బతుకుతున్నాయి. ఈ రంగంలో కంపెనీలకు అత్యధిక ఆదాయం, ప్రాజెక్ట్‌లు అమెరికా, అక్కడి కంపెనీల నుంచే రావాలి. అమెరికాతో పోల్చితే జీతాలు, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం మెరుగైన మానవ వనరులు లభ్యమవుతుండటంతో అక్కడి సంస్థలు ఎక్కువగా భారతపై ఆధారపడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి కంపెనీలకు చెందిన నిపుణులైన ఉద్యోగులు అమెరికాకు వెళ్లి అక్కడ సంస్థ తరుపున పని చేయాల్సి ఉం టుంది. ఇలా ఏటా లక్షల మంది భారత నుంచి అమెరికాకు వెళ్తుంటారు. ఇలా వెళ్లేవారికి హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలు కీలకం. ఈ నేపథ్యంలో వాటిపై ఆంక్షలు విధిస్తే భారత నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయి.. ఆ ప్రభావం ఐటీ సంస్థలపై పడే అవకాశముంది. మరోవైపు అక్కడ ఉన్న తమ కార్యాలయాల్లో అమెరికన్లను నియమించాలంటే వారికి అధిక వేతనం ఇవ్వాలి. దీంతో హెచ్‌1బీ వీసాల నిబంధనలు కఠినతరమైతే రూ.100000 కోట్ల పరిశ్రమ కాస్త ఇబ్బందుల్లో పడే అవకాశముంటుంది. 

మరి అమెరికాకు!

హెచ్‌1బీ వీసాల నిబంధనలను కఠినతరం చేయడం వల్ల అమెరికాకు తాత్కాలికంగా ప్రయోజనం ఉన్నా.. దీర్ఘకాలంలో నష్టమే వస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అక్కడ శాస్త్ర, సాంకేతికం, ఇంజనీరింగ్‌, గణితం (స్టెమ్‌) రంగాల విద్యార్థుల సంఖ్య బాగా తక్కువ. ఆయా రంగాల్లో ఉధ్యోగాలను విదేశీయులతో భర్తీ చేయకుంటే ఇబ్బందు లు తప్పవని నిపుణులు అంటున్నారు. ఐటీ, ఇతర సాంకేతిక రంగంలో 2020కి అమెరికాలో పదిలక్షల మంది నిపుణుల అవసరం ఉందని.. ఆ మేరకు అక్కడ స్థానికులు అందుబాటులోకి రావడం కష్టమంటున్నారు. విదేశీయులను నియంత్రిస్తే.. దీర్ఘకాలంలో అమెరికాకే నష్టం వస్తుందని అంటున్నారు. 
– సెంట్రల్‌ డెస్క్‌ 

హెచ్‌1బీ వీసా లక్ష్యం! 
ఆయా రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులకు అమెరికాలోని కంపెనీల్లో తాత్కాలికంగా ఉద్యోగాలు కల్పించండం. 

హైదరాబాద్‌పై ఎక్కువ ప్రభావం! 
దేశంలో హెచ్‌1బీ వీసాలు హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి గణనీయంగా జారీ అవుతున్నాయి. దేశంలో అత్యధిక వీసాలు జారీ చేసిన కార్యాలయాల్లో హైదరాబాద్‌ కార్యాలయం రెండో స్థానంలో ఉంది. ఇక ప్రపంచం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకకుంటే ఇది 5వ స్థానంలో ఉంది. 

మనమే ఎక్కువ! 
అమెరికా ఏటా జారీ చేసే హెచ్‌1బీ వీసాల ద్వారా అక్కడకు వెళ్తున్నవారిలో అత్యధికులు భారతీయులే. మొత్తం వీసాల్లో 70-80 శాతం భారతీయులకే వస్తున్నాయి. ఈ ఏడాది 3.16 లక్షల హెచ్‌1బీ వీసాలు ఇస్తే అందులో 70 శాతం అంటే దాదాపు 2.2లక్షలు భారతీయులకే వచ్చాయి. భారత తర్వాతి స్థానంలో చైనా ఉంది. 

ట్రంప్‌ ఇలా ఎందుకు చేస్తున్నాడు! 
అమెరికాలో ముఖ్యంగా ఐటీ సేవల రంగంలో లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు. అక్కడి కంపెనీలు అమెరికన్లతో పోల్చితే విదేశీయులకు కనీస వేతనం తక్కువగా చెల్లిస్తున్నాయి. ఇలా తక్కువ ధరకు నిపుణులు లభిస్తుండటంతో స్థానికు ఉద్యోగులను తొలగించడం పెరిగిం ది. దీంతో అక్కడి నిరుద్యోగ సమస్యకు హెచ్‌1బీ వీసాలు పరోక్షకారణమయ్యాయి. ఎన్నికల్లో ట్రంప్‌ అసాధారణ హామీలిచ్చారు. అధ్యక్షుడైన వెంటనే వీటిని అమలు చేయ డం కష్టం. ఏదో ఒకటి చేయకుంటే ప్రజలు ఊరుకోరు. దీంతో ట్రంప్‌ అధ్యక్షుడైన వెంటనే హెచ్‌1బీ వీసాల నిబంధనలను కఠినతరం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.