అత్తింటి వేధింపులకు నవవధువు ఆత్మహత్య

వరకట్న వేధింపులపై పోలీసులు కేసునమోదు

యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): అత్తింటి వేధింపులకు నవవధువు బలైంది. కాళ్ల పారాణి ఆరకముందే ఆత్మహత్యకుపాల్పడింది. పెళ్లి చేసుకుని గంపెడాశతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ యువతి మానసకు కట్నరూపంలో వేధింపులు స్వాగతం పలికాయి. నెలరోజులకే అదనపు కట్నం కావాలని అత్తా, ఆడపడుచు, భర్త వేధింపులకు గురిచేశారు. వారి బాధలు తట్టుకోలేక నవవధువు ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో జరిగింది.రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం, ఉల్కాపురి గ్రామానికి చెందిన విక్రమ్‌ గౌడ్‌తో మానసకు గత ఏడాది డిసెంబర్‌ 14న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 4 లక్షలు, బంగారం, లంఛనాలు ముట్టజెప్పారు. ఇల్లు సయితం అమ్మి ఘనంగా పెళ్లి జరిపించారు. అయితే పెళ్లయిన నెలకే ఆమెకు అత్తాగారింట్లో వేధింపులు మొదలయ్యాయి. అది తట్టుకోలేని మానస పుట్టింటికి వచ్చి, బాత్‌ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటివారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలోనూ కుటుంబంలోనూ తీవ్ర విషదం నింపింది.