అదిరించిన రాహుల్…

636177125077109685చెన్నై: భారత్-ఇంగ్లండ్‌ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగు తున్న ఐదో టెస్టులో బ్యాట్స్‌మెన్‌ హవా కొనసాగుతోంది. ఆటకు మూడోరోజైన ఆదివారం కూడా బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించగా.. బౌలర్లకు నిరాశ తప్పలేదు. ఓపెనర్‌ లోకేష్‌ రాహుల్‌ (311 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 199) కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ అవకాశాన్ని ఒక్క పరుగు తేడాతో చేజార్చుకున్నప్ప టికీ భారతను సురక్షిత తీరాలకు చేర్చాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 60/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 391 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ (112 బంతుల్లో 7 ఫోర్లతో 71), కరుణ్‌ నాయర్‌ (136 బంతుల్లో 6 ఫోర్లతో 71 బ్యాటింగ్‌) అర్ధ శతకాలతో రాణించారు. చటేశ్వర్‌ పుజారా (16), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (15) వికెట్లను వెంటవెంటనే కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత.. ‘కర్ణాటక జంట’ రాహుల్‌, కరుణ్‌ పోరాటంతో కోలుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టువర్ట్‌ బ్రాడ్‌, మొయిన్‌ అలీ, బెన్‌ స్టోక్స్‌, ఆది ల్‌ రషీద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు కోహ్లీ సేన ఇంకా 86 పరుగులు వెనకబడే ఉంది. చేతిలో ఆరు వికెట్లున్నాయి. ప్రస్తుతం కరుణ్‌కు తోడు మురళీ విజయ్‌ (17 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.
రాహుల్‌, పార్థివ్‌ ఫటాఫట్‌..: రెండోరోజు శుభారంభం చేసిన రాహుల్‌, పార్థివ్‌ జోడీ అదే జోరు ఆదివారం ఉదయం కూడా కొనసా గించింది. బ్రాడ్‌ బౌలింగ్‌లో పార్థివ్‌ బౌండ్రీ సాధించి తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ తర్వాత డాసన్‌ వేసిన వరుస ఓవర్లోనే రాహుల్‌ రెండు సొగసైన సిక్సర్లు సాధించాడు. హాఫ్‌ సెంచరీ దిశగా వడివడిగా సాగి పోయిన రాహుల్‌… బ్రాడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 28వ ఓవర్లో డబుల్‌ తీసి ఆ మార్కు చేరుకున్నాడు. ఆ వెంటనే మరో బౌండ్రీ సాధించాడు. అనంతరం పార్థివ్‌ కూడా గేర్‌ మార్చాడు. అయితే ఈ జోడీని అలీ విడదీశాడు. దీంతో 152 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.