అధికారులు సమన్వయంతో పనిచేయాలి

రెవెన్యూ, వ్యవసాయాధికారులతో ఎమ్మెల్యే సవిూక్ష
జనగామ,మే22(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకంలో రెవెన్యూ, వ్యవసాయాధికారులు సమష్టిగా సమన్వయంతో పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావు కోరారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సవిూక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన వివరాలపై గ్రామాల వారీగా ఆరా తీశారు. కొడకండ్ల, పాలకుర్తి మండలాల పరిధిలో సుమారు 800 వరకు ఫిర్యాదులొచ్చాయని అధికారులు గుర్తించారు. మరో నెల రోజుల్లోపు అర్హులైన అందరికీ రైతుబంధు ఫలాలు అందాలని సూచించారు. ఇతర గ్రామాల్లో నివాసముంటున్న రైతులకు చరవాణిలో విషయం తెలియజేసి చెక్కులు అందేలా చొరవ తీసుకోవాలని చెప్పారు. అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. ఆర్డీవో రమేశ్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో వీఆర్వోలు అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలన్నారు. రైతులిచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఏడీఏ రాధిక, ఎంపీపీ దల్జీత్‌కౌర్‌, తహసీల్దార్లు అహ్మద్‌, బన్సీలాల్‌, రైసస జిల్లా సభ్యుడు బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.