అనంతలో మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

సమస్యల పరిష్కారం కోసం కళ్లకు గంతలతో ర్యాలీ
అనంతపురం,జూన్‌7(జనం సాక్షి):తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ.. అనంతపురం నగరంలోని 1 వ సర్కిల్లో మున్సిపల్‌ కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… జూన్‌ 1 నుండి 10 వ తేదీ వరకు సిఐటియు ఆలిండియా పిలుపులో భాగంగా అనంతపురంలోని మున్సిపల్‌ కార్మికులు ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు. సిఐటియు నగర కార్యదర్శి వెంకట్‌ నారాయణ మాట్లాడుతూ… కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక సమస్యలను విస్మరించి, కార్పొరేటర్‌ శక్తులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. కరోనా వారియర్స్‌ గా గుర్తించిన మున్సిపల్‌, ఆశా, అంగన్వాడి పంచాయతీ కార్మికులం దరికీ రూ.50 లక్షలు కోవిడ్‌ బీమా సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, వైద్యాన్ని, ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి వారి కోట్లాది రూపాయల సంపాదనకు సహకరిస్తున్నారని, మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను పెంచుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. కష్టకాలంలో భవన నిర్మాణ, ఆటో, తోపుడు బండ్లు, ప్రతి పేద కుటుంబానికి ఆసరా కల్పించే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వెంకట్‌ నారాయణ పేర్కొన్నారు.