అనుభవమే ఆయనకున్న పెద్ద అసెట్‌

అసెంబ్లీ నిర్వహణలో సమవర్తిగా ఉండకతప్పదు

సభాపతిగా పోచారం మరింత రాణించడం ఖాయం

హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇకపై శాసనసభ వ్యవహారాలను సమర్థంగా నడిపించబోతున్నారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న సిఎం కెసిఆర్‌ ఆచితూచి పోచారంను ఎంపిక చేశారు. సభను హుందాగా నడపాలన్నదే కెసిఆర్‌ ఆకాంక్షగా ఉంది. అందుకే స్పీకర్‌ ఎన్నికలో భారీగానే కసరత్తు చేశారని భావించాలి. సభను నడపడం కూడా కత్తివిూద సాములాంటి. ప్రధానంగా రూల్స తెలిసి, సమయస్ఫూర్తితో ముందుకు తీసుకుని వెళ్లాలి. సభ్యులు నొచ్చుకోకుండా వారిని మెప్పించి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇవన్నీ పోచారం శ్రీనివాసరెడ్డిలో మెండుగా ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వాక్పటిమ ఆయనకు ఉన్న పెద్ద అసెట్‌. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌.. అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం పేరును ప్రతిపాదించారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావడంతో అందరివాడు అనిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. సభను హుందాగా నడపడంలో గతంలో ఎందరో స్పీకర్లు ముందున్నారు. సింగిల్‌ విండో చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పోచారం.. రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో కీలక భూమిక పోషించారు. ఈ దఫా స్పీకర్‌గా కీలకమైన పదవి నిర్వహించబోతున్నారు. ఇది కూడా బాధ్యతతో కూడా పదవి తప్ప ఆషామాషీ వ్యవహారం కాదు. సీనియర్‌ ఎమ్మెల్యేగా ఆయనకు మంచి పేరు ఉన్నది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయనకు ప్రజల మనిషిగా మంచి గుర్తింపు ఉంది. మంత్రిగా ఉన్నా తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. తెలంగాణ తొలి వ్యవసాయశాఖ మంత్రిగా తనదైన శైలిలో రాణించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహం నింపారు. మోకాలికి శస్త్ర చికిత్స జరిగినా వెనుకడుగు వేయకుండా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. త ఏడాది అక్టోబర్‌ 3న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని లక్ష్మీపుత్రుడిగా అభివర్ణించారు. నిఖార్సైన రైతుబిడ్డ అని, వ్యవసాయశాఖ మంత్రిగా అద్భుతంగా పనిచేశారని, రైతుబంధు, రైతుబీమా వంటి అద్భు తమైన పథకాల అమలులో క్రియాశీలకంగా వ్యవహరించారని ప్రశంసిస్తూ లక్ష్మీపుత్రుడు అనే బిరుదు ఇచ్చారు. అంతేకాదు అనేక సందర్భాల్లోనూ పోచారం పనితీరును సీఎం కేసీఆర్‌ అభినందించారు. నీటి తీరువా రద్దు, ఎర్రజొన్న రైతులకు బకాయిల చెల్లింపు వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలన్నీ పోచారం హయాంలోనే అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు. ప్రత్యేకించి నిబద్దత కలిగిన రాజకీయవేత్తగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన అనుభవం ఇప్పుడు అసెంబ్లీ నిర్వహణకు అసెట్‌ కానుంది. అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావనలు, చర్చల విషయంలో స్పీకర్‌కు సభ్యులు కూడా సహకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలబోతగా తెలంగాణ రెండో శాసనసభ మరింత హుందాను సంతరించుకుంటుందనడంలో సందేహం లేదు.