అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది


– ఈవీఎంలు వాడే దేశాల్లో మళ్లీ బ్యాలెట్‌ పేపర్‌నే వాడుతున్నారు
– తెలంగాణలో 31నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో తేడా వచ్చింది
– టీడీపీ ఎంపీ కనకమేడల
అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరుగుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. ఈవీఎంలు ఉపయోగిస్తున్న దేశాలు కూడా మళ్లీ బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోకి వచ్చాయని అన్నారు. ఈవీఎంల హ్యాకింగ్‌ అంశంపై బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బ్యాలెట్‌ పేపర్‌ విధానంతోనే నమ్మకం కుదురుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ఈవీఎంలపై విపక్ష పార్టీలన్నీ అనుమానం వ్యక్తం చేస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో 31నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు లెక్కింపు ఓట్లలో తేడా వచ్చిందని ఎంపీ కనకమేడల అన్నారు. ఈసీ ఒక రాజకీయ పార్టీలా మాట్లాడడం సరికాదన్నారు. దేశంలో 23 పార్టీలు ఈవీఎంలని వ్యతిరేకిస్తున్నప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు పార్టీలను సమావేశానికి  పిలవడంలేదని నిలదీసారు. గతంలో బిజెపి ఎంపీ జివీయల్‌ సైతం ఈవీఎంలను వ్యతిరేకించారని.. అయినా ఇప్పుడు బీజేపీ  మళ్ళీ ఈవీఎంలవైపే మొగ్గు చూపుతుందని టీడీపీ ఎంపి అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనే ఈవిఎంలను టీడీపీ వ్యతిరికించిందని స్పష్టం చేసిన కొనకళ్ల,
ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉందన్నారాయన. ఈవిఎంలపై ఎన్నికల సంఘం మొండి వాదన సరికాదని తేల్చి చెప్పారు.  జనసేనతో పొత్తుల అంశం ప్రస్తావనే లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని చంద్రబాబు జనసేనను కోరారన్నారు. పొత్తులు..చర్చలను విషయాన్నిఅధిష్టానం చూసుకుంటుందని కనకమేడల వ్యాఖ్యానించారు.