అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

అభివృద్ది సాగాలంటే మళ్లీ టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి : డాక్టర్‌ సంజయ్‌
జగిత్యాల,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  నాలుగేళ్లుగా కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేశారనీ జగిత్యాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ అన్నారు.  ఉద్యోగుల జీతాలను 40 శాతం నుంచి 200 శాతానికి పెంచిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఆర్టీసీ కార్మికులు, వీఆర్‌ఏలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల జీతాలు పెంచడం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. గీత, నేత, బీడీ కార్మికులు పెన్షన్లతో ఆసరా కల్పించిందీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌ తర్వాత జగిత్యాలకు అంత ప్రాముఖ్యత ఉందనీ, కార్మికులు సమావేశం పెట్టుకుందామంటే స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, జిల్లా కేంద్రంలో కార్మిక సంఘ భవనం నిర్మించి, ప్రతి విభాగానికీ గది కేటాయించాలని ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం పక్షాన సంజయ్‌ని అధిక మెజార్టీతో గెలిపించాలని పలువురు కార్మిక నేతలు పిలుపునిచ్చారు. గతంలో కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండేవనీ, అలాంటిది రాష్ట్రం ఏర్పడ్డాక కార్మికుల సమస్యలపై సీఎం అంతటి వ్యక్తి కూడా చర్చల్లో పాల్గొని సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కార్మికులతో చర్చించడంతో పాటు, వారితో కలిసి భోజనం చేసిన సీఎం దేశంలో ఎక్కడాలేరన్నారు. అధికార దాహంతోనే మహాకూటమి నేతలు ఆరాటపడుతున్నారనీ, బంగారు తెలంగాణ సాధన కోసమే తమ పోరాటమని పేర్కొన్నారు. ఎన్నికల యుద్ధంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వీర సైనికుల్లా పనిచేసి జగిత్యాల ఖిలాపై గులాబి జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలని, నాయకులు, కార్యకర్తలు ప్రణాళికతో, బాధ్యతతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు పూర్తి కావాలంటే, కోటి ఎకరాలకు సాగునీరు రావాలంటే టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాల పాలనలో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నా రు. ప్రతి ఒక్కరు ఏదోవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ది పొందడంతో గ్రామాల్లో కుల సంఘాలు, వృత్తి సంఘాలు, రైతులు, వ్యాపారవేత్తలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారనీ, కారు గుర్తుకే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారన్నారు. తప్పకుండా టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేస్తామ ని అంటున్నారన్నారు. జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్‌ పాలనలో ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్‌ ఎంపీ కవిత సహకారంతో అభివృద్ధి చెందిందన్నారు. మరింత అభి వృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.