అప్పట్లో మన భాషకు తీరని ద్రోహం: యాదగిరి

హైదరాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి పాలనలో తెలంగాణ భాషకు,యాసకు తీరని ద్రోహం జరిగిందని సీనియర్‌ పాత్రికేయులు, పత్రికా సంపాదకులు పాశం యాదగిరి అన్నారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన యాస ఉందన్నారు. దీనిని తృణీకరించారని, ఇది పనికిరానిదని ముద్ర వేశారని అన్నారు. తెలుగు మహాసభల ద్వారా చాలాకాలం తరవాత తెలంగాణ భాషకు గుర్తింపు రాబోతున్నదని శుక్రవారం నాడిక్కడ అభిప్రాయపడ్డారు. తెలుగు భాష హైదరాబాద్‌ బిర్యానీ అంత సుగంధమైనదని అన్నారు. తెలంగాణను ఎన్నో ఏండ్లు ఆంధ్రావాళ్లు పాలించారని, దాంతో  వారు చెప్పిందే వేదమన్నారు. తెలుగు భాష తియ్యదనం తెలియని వారు మనల్ని వెక్కిరించారన్నారు.  సరళంగా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా మాట్లాడడం మన ప్రత్యేకత అని చెప్పారు. అన్నదమ్ముల్లా విడిపోయిన మనం తెలుగుభాష అభివృద్ధికి తెలుగువాళ్లు పాటుపడాలన్నారు. ఉమమడి రాష్ట్రంలో  మన శాసన సభ్యులు అసెంబ్లీలో వంద మంది ఉంటే ఆంధ్రా వారు 200 మంది ఉండేవారన్నారు. దాంతో మన వాదన ఏదీ చెల్లలేదని అన్నారు. కానీ నేడు రాష్ట్రం సాధించుకున్నాక ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న వారందరు మన వాళ్లేనని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాహితీ ప్రియులని, తెలుగు భాష విలువను నలువైపులా చాటుతున్నారని తెలిపారు. ప్రపంచ తెలుగుమహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగు భాష, కర్ణాటక గొండి, ఉత్తర కొండి, మధ్య కొండి, గ్రీకు, సుమోరు పర్వతాల్లో పుట్టిందని తెలిపారు. అసెంబ్లీలో తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మాట్లాడే వారు మనవారే అన్నారు.పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలోను తెలుగు లిపి ఉందన్నారు. వారితో కలిపితే 16 కోట్ల మంది తెలుగు మాట్లాడే వారున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భాషఫ, యాస ప్రధాన భూమిక పోషించాయని అన్నారు.