అబద్దాల బిజెపికి..నిబద్దత గల టిఆర్‌ఎస్‌కు పోటీ


తెలంగాణ సంక్షేమ పథకాలు బిజెపి ఎందుకు చేయదు
బిజెపి రైతుల వ్యతిరేక ప్రభుత్వం..ఏడాదిగా పట్టించుకోని ఆందోళనలు
ప్రచారంలో మండిపడ్డ మంత్రి హరీష్‌ రావు
కరీంనగర్‌,అక్టోబర్‌8 (జనంసాక్షి) : హుజూరాబాద్‌ ఎన్నికల్లో అబద్దాల బీజేపీకి, నిబద్ధత గల టీఆర్‌ఎస్‌కు మధ్యే పోటీ ఉందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. అమ్మకాల బీజేపీకి, నమ్మకాల టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ జరుగుతోందన్నారు. బీజేపీ పాలిత రాష్టాల్ల్రో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. పేదలను దంచు.. పెద్దలకు పంచు అన్నదే బీజేపీ నినాదమని వ్యాఖ్యానించారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని మంత్రి హరీష్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ బతికి ఉండగా, కేంద్రం తెస్తున్న ఒత్తిడికి తలొగ్గి రైతుల కరంట్‌ మోటర్లకు విూటర్లు పెట్టనీయరని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం దేశంలోని అనేక రాష్టాల్రు రైతుల కరంట్‌ మోటర్లకు విూటర్లు పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా విూటర్లు బిగిస్తున్నారని, సీఎం కేసీఆర్‌ ఎట్టి పరిస్థితుల్లో అందుకు సమ్మతించరని చెప్పారు. హుజూరాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు అసత్యపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకోసం తమ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంట్‌, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఏడాదిలో రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నదని, ఆసరా పింఛ న్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్ల వంటి పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. అదే కేంద్రంలోని బీజేపీ నల్ల చట్టాలు తెచ్చి రైతులను రోడ్డుపైకి లాగిందని, ఈ చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రులు కార్లు ఎక్కించి చంపుతున్నారని, వంట గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌, మంచి నూనె లాంటి నిత్యవసరాల ధరలు పెంచి సామాన్యులు బతకలేని స్థితిని కల్పిస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి పార్టీకి ఓట్లు ఎలావేస్తారని ప్రశ్నించారు. ఇకపోతే ఈటెల రాజేందర్‌ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. హుజూరాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా గుర్తించాలనో, ఇక్కడికి ప్రభుత్వ వైద్య కళాశాల కావాలనో, మరో ప్రజా సమస్య కోసమో ఆయన రాజీనామా చేయలేదని తెలిపారు. స్వార్థం కోసం రాజీనామా చేశారని, స్వార్థం కోసం హుజూరాబాద్‌ ప్రజలు బలైపోయినా పర్వాలేదనే ధోరణిలో ఉన్నారన్నారు. మంత్రిగా ఉండి ఒక్క డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టివ్వలేని అసమర్థుడు రాజేందర్‌ అని దుయ్యబట్టారు. ఇక్కడ కేసీఆర్‌ ఆదేశాల మేరకు జరుగుతున్న పనులన్నీ తన రాజీనామాతోనే వస్తున్నాయని చెప్పుకుంటున్నారని, మంత్రిగా ఉన్న ఏడేండ్లలో ఆయనకు చేసే అధికారం ఉన్నా చేయలేని పనులన్నింటినీ ఇప్పుడు తాము వచ్చి చేస్తున్నామని చెప్పారు. ఇంకా రెండున్నరేండ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ప్రజల అవసరాలు తీరాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే జిమ్మేదారి తనదని హావిూ ఇచ్చారు. దేశం గర్వించేలా సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశ పెట్టి, పేదల కడుపు నింపుతుంటే, రైతులకు వెన్ను దన్నుగా నిలుస్తుంటే, ఈటల మాత్రం ఈ పథకాలు వద్దని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.