అభివృద్దిని అడ్డుకునే కూటమిని తరిమికొట్టాలి

కాళేశ్వరంతో మారనున్న రైతుల దశ

డిసెంబర్‌ 11న కెసిఆర్‌ ఆధ్వర్యంలో రైతు రాజ్యం

మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

కామారెడ్డి,నవంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తుకూడిందని మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ పొత్తు విఫలం కాక తప్పదన్నారు. బుదవారం ఆయన నామినేషన్‌ వేసేందుకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ప్లలెలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న పనులకు కాంగ్రెస్‌ నేతలు తరుచూ అడ్డుపడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీకి బద్దశత్రువు అయిన కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని స్వార్థ రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్రపన్నుతున్నాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి మహాకూటమి జాడలేకుండా చేస్తామన్నారు. ప్రజలు కారు గుర్తుకే ఓటు వేసి లక్షకు పైగా మెజార్టీతో టీఆర్‌ఎస్‌ని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో డిసెంబర్‌ 11 కెసిఆర్‌ ఆధవ్యర్యంలో మరోమారు రైతు రాజ్యం ఏర్పడబోతోందని పోచారం శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సెంబర్‌ ఏడు నాటి పోలింగ్‌లో ప్రజలంతా కారు గుర్తుకే ఓటేసి టీఆర్‌ఎస్‌ పార్టీని అఖండ విజయాన్ని అందించనున్నారని పేర్కొన్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ట్రం పరిస్థితి అధోగతేనని తెలిపారు. రాష్ట్రంపై కనీస అవగాహన లేని కాంగ్రెస్‌ పార్టీ నాయకుల చేతికి రాష్ట్ర పరిపాలన బాధ్యతలు వెళ్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని పోచారం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల పంచాయితీ దిగజారుడు తనానికి మచ్చుతునకలా మారిందని తెలిపారు. కెసిఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కోటి ఎకరాలకు 2 పంటలకు సరిపడా సాగు నీళ్లు అందించడం ఖాయమని పోచారం తెలిపారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అనే నినాదాన్ని సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు కోర్టుల్లో కేసులు వేసి రైతుల పొట్ట కొడుతున్నాయని మంత్రి మండిపడ్డారు. వందలాది కేసులతో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే కుట్రలకు దిగిన కాంగ్రెస్‌ పార్టీకి రైతులు, సామాన్య జనం ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే జూన్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని, జూన్‌ తర్వాతి కాలం నుంచి కామారెడ్డి ప్రాంతానికి సాగు నీళ్లు వస్తాయని పేర్కొన్నారు.వృథా జలాలు సద్వినియోగం అవుతాయని చెప్పారు.