అభివృద్దిలో ప్రణాళికా సంఘందే కీలక భూమిక

వినోద్‌ అనుభవానికి తగిన ఎంపిక
హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  :  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాల్లో ప్రణాళికాసంఘం పాత్ర అత్యంత కీలకమైనది. ముఖ్యమంత్రి నిత్యం పరిపాలనాపరమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉం డాల్సిన అవసరం ఉండడంతో ప్రణాళికలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఉపాధ్యక్షుడి పైనే ఉంటుంది. అందుకే  ఉపాధ్యక్ష పదవిని కీలకమైన వ్యక్తులకు మాత్రమే అప్పగిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను ప్రభుత్వం నియమించడం వెనక కెసిఆర్‌ తన లక్ష్యాలను ముందుకు తీసుకుని వెల్లే వ్యక్తిగా నిలిపారు. వినోద్‌ కుమార్‌ను తన కుడిభుజంగా పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పదవి అప్పగించి ఆయనకు సముచితస్థానాన్ని కల్పించారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్య క్షుడిగా వ్యవహరించే రాష్ట్ర ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉంటూ అన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వినోద్‌కుమార్‌ ముఖ్యపాత్ర వహించే అవకాశం లభించింది. హైకోర్టు న్యాయవాదిగా, తెలంగాణ ఉద్యమకారునిగా రాజకీయాల్లో, పరిపాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉండడంతో ఆయన సేవలను మరింతగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినోద్‌కుమార్‌కు ఈ పదవిని అప్పగించారు. వినోద్‌కుమార్‌ టీఆ ర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఆపార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా కేసీఆర్‌తోపాటు అన్ని ఉద్యమ కార్యాచరణల్లో కీలకంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలపాత్ర వహించడమే కాకుండా తెలంగాణకు మద్దతుగా జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతును కూడగట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలను తీసుకోవడంలో వినోద్‌కుమార్‌ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన కరీంనగర్‌ ఎంపీగా ఉంటూనే తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో ప్రయత్నించడంలో కృషి చేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పరాజయం పాలుకావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన సేవలను ప్రణాళికా సంఘం ద్వారా వినియోగించుకోవాలని నిర్ణయించారు. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వినోద్‌కుమార్‌ అనూహ్యంగా బిజెపి అభ్యర్థి బండి సంజయ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. తొలుత వినోద్‌కు
ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటార్న ప్రచారం కూడా సాగింది.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఇప్పటికే ఈటల రాజేందర్‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా, కొప్పుల ఈశ్వర్‌ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా త్వరలో కేటీఆర్‌కు కూడా మంత్రివర్గంలో చోటు ఖాయమ ని చెబుతున్నారు. దీంతో ఒకే జిల్లా నుంచి నాలుగు మంత్రి పదవులు అందులో వెలమ సామాజికవర్గానికి రెండు పదవులు అవుతాయనే భావనతో వినోద్‌ కుమార్‌కు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారని సమాచారం. ముఖ్యమంత్రి తన ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రణాళికాసంఘాన్ని అభివృద్ధి విషయంలో కీలకం చేయాలని నిర్ణయానికి వచ్చి వినోద్‌కుమార్‌కు ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలో నే పూర్తిస్థాయి బ్జడెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్నిశాఖలకు సంబంధించిన వ్యవహారాలను సవిూక్షించి ప్రతిపాదనలు తయారుచేసే కీలకమైన పనిని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌కుమార్‌కు అప్పగించారు. రాజకీయ నేతగా అనుభవం ఉన్న వినోద్‌ ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు తగిన అవకాశం ఏర్పడింది.