అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాలకు తెలుసు

ఎన్నికల్లో వారికి బుద్ది చెప్పడం ఖాయం : మంత్రి

నిర్మల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, టిడిపిలు రాజకీయంగా తమ ప్రాబల్యం లేకుండా పోతుందనే భావనతో తెలంగాణ అభివృద్ది పనులపై కుట్ర చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఈ రెండు పార్టీలు ఏ పనిచేసిన వ్యతిరేకించడం అలవాటు చేసుకున్నాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతికి పెద్దపీట వేసింది విూరు కాదా అని మంత్రి మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మిషన్‌ కాకతీయ,మిషన్‌ భగీరథతో కాంగ్రెస్‌,టిడిపిల ఉనికి గల్లంతు కానుండడంతో వాటికి బెంగపట్టుకుందని, అందుకే పని ఏదైనా అడ్డుకోవడమే లక్ష్యమన్న రీతిలో ఉన్నాయన్నారు. కాళేశ్వరం కోసం మహారాష్ట్ర ఒప్పందాన్ని కూడా కాంగ్రెస్‌ ,టిడిపిలు వ్యతిరేకించాయన్నారు. దీనిని బట్టి వీరికి అభివృద్దికన్నా సొంత లాభమే మిన్నగా ఉందన్నారు. ప్రతిపక్షపార్టీలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో, అటు మహారాష్ట్రలో, కేంద్రంలోనూ అధికారంలో ఉన్నా ఇది సాధించలేకపోయారని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించే ఐదు ఆనకట్టల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలోనే విమర్శలు చేశారని మంత్రి తెలిపారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి కాంగ్రెస్‌ పార్టీ నేతలు అభాసుపాలయ్యారని అన్నారు. పెన్‌గంగ నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలనేది 70 ఏళ్లనుంచి రైతులు కలలు కంటున్నారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢసంకల్పంతో ఇది సాధ్యమవుతోందని వివరించారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ఆనకట్టతో ఆ ప్రాంత రైతులందరికి ప్రయోజనం చేకూరనుందన్నారు. ఒప్పందాల వల్ల ప్రాజెక్టులను కట్టుకుంటే పెన్‌గంగ నదిపై చనాక-కోర్టా ఆనకట్ట పూర్తయ్యాక తాంసి, ఆదిలాబాద్‌, జైనథ్‌ మండలాలకు 13,500 ఎకరాలకు సాగునీరు అందనుందని వివరించారు. రాజంపేట, పెంప్రాడ్‌ ఆనకట్టలతో ఈ ప్రాంతంలో మరో 7వేల ఎకరాలకు సాగునీరు అందునుందని పేర్కొన్నారు.