అమరుడి తల్లికి అవమానమా?

 

మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తీరుపై మండిపడ్డ శంకరమ్మ

వేరెవరికి టిక్కెట్‌ ఇచ్చినా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌ టికెట్‌ కోరుతున్న ఆమె సోమవారం మరోసారి తెలంగాణ భవన్‌కు వచ్చారు. తనకు హుజూర్‌నగర్‌ టికెట్‌ రాకుండా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన నాలుగేళ్లుగా తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నారై సైదిరెడ్డికి టికెట్‌ ఇప్పించేందుకు జగదీశ్‌ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని శంకరమ్మ ఆరోపించారు. తాను బీసీ మహిళ అయినందువల్లే తనకు టికెట్‌ రాకుండా మంత్రి అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సైదిరెడ్డికి టికెట్‌ ఇస్తే తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. జగదీశ్‌ రెడ్డికి అమరవీరుల ఉసురు తగులుతుందన్నారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి వందల కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, కేటీఆర్‌లపై తనకు ఎంతో గౌరవం ఉందని శంకరమ్మ పునరుద్ఘాటించారు. అంతేకాదు ఒక అమరవీరుని తల్లినని చూడకుండా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని బాధపడ్డారు. ఎన్నారై సైదిరెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని ఆయన్ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అయినా కేసీఆర్‌ తనకే టికెట్‌ ఇస్తారని నమ్ముతున్నానని చెప్పారు. ప్రాణం పోయినా పార్టీని వీడని వెల్లడించారు. తనకు టికెట్‌ ఇవ్వకపోతే అమరవీరులకు అవమానమని తెలిపారు. ఒకవేళ మంగళవారం సైదిరెడ్డికి టికెట్‌ ప్రకటిస్తే.. సూర్యాపేట తెలంగాణ తల్లి విగ్రహం ముందు పెట్రోల్‌ పోసుకుని తగలబెట్టుకుంటానని హెచ్చరించారు. తన చావుకు మంత్రి జగదీష్‌రెడ్డిదే బాధ్యత అని శంకరమ్మ ప్రకటించారు.