అమితాబ్‌ చౌదరికి సివొఎ నోటీసులు

సమావేశాలకు హాజరు కాకపోవడంతో చర్యలు
ముంబై,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  బీసిసిఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి చిక్కుల్లో పడ్డారు. పలు కీలక సమావేశాలకు ఆయన హాజరుకాకపోవడంతో బోర్డున నడిపిస్తోన్న క్రికెట్‌ పాలక మండలి (సివొఎ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఐసిసి, ఏసీసీ సమావేశాలకు అమితాబ్‌ హాజరు కాకపోవడంతో నోటీసులు పంపింది. జూలై 14 నుండి 20 వరకూ లండన్‌ లో జరిగిన ఐసిసి సమావేశానికి , సెప్టెంబర్‌ 3న బ్యాంకాక్‌ వేదికగా  ముగిసిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సమావేశానికి బీసిసిఐ ప్రతినిధిగా అమితాబ్‌ హాజరు కాలేదు. దీంతో ఎందుకు హాజరవ్వలేదో వివరణ ఇవ్వాలని సివొఎ ఆదేశించింది. దీని కోసం ఏడు రోజుల గడువు ఇచ్చినట్టు సివొఎ తెలిపింది. ఐసిసి సమావేశానికి రెండు రోజుల ముందు అమితాబ్‌ తాను అందుబాటులో ఉండడం లేదంటూ సివొఎకు సమాచారమిచ్చినా… అప్పటి వరకూ ఎందుకు ఆలస్యం చేశారంటూ లేఖలో ప్రశ్నించింది. అలాగే ఏసీసీ సమావేశానికి వెళ్ళకపోవడంపైనా సివొఎకు సరైన సమాచారం ఇవ్వక పోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు సివొఎకు అమితాబ్‌ వైపు నుంచి ఎటువంటి సమాచారం అందివ్వకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సెలక్షన్‌ కమిటీ సమావేశాలకు బోర్డు కార్యదర్శని తప్పిస్తూ సివొఎ తీసుకున్న నిర్ణయమే దీనికి కారణంగా భావిస్తున్నారు.