అరాచకానికి పరాకాష్ట బీహార్‌ ఘటన

దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో అరాచకాలు ఎక్కువ. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఫ్యూడల్‌ విధానాలు సాగుతున్నాయి. రచ్చబండ తీర్పులు అమలవుతున్నాయి. పరువు హత్యలు సాగుతున్నాయి. వీటికి తోడు అత్యాచార ఘటనలు కూడా అటువైపు ఎక్కువే. ఢిల్లీలో నిర్భయ ఘటన తరవాత కఠిన చట్టం తెచ్చినా అనేకానేక ఘటనలు జరిగాయి. ప్రజల్లో భయం లేకపోవడమన్న ఏకైక కారణంగా మహిళలపై అత్యాచారాలు సాగుతూనే ఉన్నాయి. బలవంతంగా ఎత్తుకెళ్లి రేప్‌ చేసి వదిలేయడం, తగులబెట్టడం, పాతిపెట్టడం, దారుణంగా చంపేయడం వంటి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. అమ్మాయిలను అక్రమంగా తరలించడం,వారిని వ్యభిచార కూపాల్లోకి నెట్టడం వంటి చట్టవ్యతిరేక అమానుషాలకు కొదువే లేకుండా పోతోంది. ఇలాంటి ఘటనల్లో కఠిన శిక్షలు అమలు చేసి ఉరిశిక్షల్లాంటివి జరిపి ఉంటే కొంతయినా భయం ఉండేది. దీనికి ప్రభుత్వాల వైఫల్యాలే కారణంగా చెప్పుకోవాలి. బీహారల్‌లో ఒకప్పుడు రాక్షస రాజ్యం నడిచింది. అక్కడ అఘాయిత్యాలకు అంతేలేకుండా పోయింది. మాఫియా రాజ్యం ఏలింది. నితీశ్‌ కుమార్‌ సిఎం అయ్యాక కొంత మార్పు వచ్చిందని అంతా భావించారు. కానీ అదంతా ఉత్తిదే అని ఇటీవలి ఘటన ఒకటి రుజువు చేసింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ అనాథాశ్రమంలో మైనర్‌ బాలికలపై సాగిన అఘాయిత్యం దేశాన్ని కుదిపేసింది. మైనర్‌ బాలికలపై నిత్యం అత్యాచార ఘటన సాగిన తీరు దారుణం కాక మరోటి కాదు. ఉన్నావ్‌, కథువా ఘటనలపై నోరు పారేసుకున్న విపక్షాలు ఎందుకనో ఇలాంటి దారుణ ఘటనపై పెద్దగా స్పందించలేదు. నితీశ్‌ను ఎండగట్టి అక్కడి అరచకాన్ని నిలదీయలేదు. కొత్తగా ఎన్ని చట్టాలు తెస్తున్నా, పోస్కో వంటివి ఉన్నా, తమను ఎవరూ ఏవిూ చేయలేరన్న ధీమా కారణంగానే అధికారులు, చోటామోటా నాయకులు ఈ అనాథాశ్రమం ముసుగులో అఘాయిత్యాలకు ఒడిగట్టారు. ఈ దారుణ ఘటనలో, ముప్పై ఐదుమందిపై అత్యాచారం జరిగినట్టు రుజువైంది. అనాథాశ్రమ నిర్వాహకులతో పాటుగా, పోలీసులు, అధికారులు కూడా ఈ పాపంలో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అనాథా శ్రమంలోని పసిమొగ్గలను ఇలా బలిపెట్టి దాని నిర్వాహకుడు బ్రజేష్‌ ఠాకూర్‌ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వైనం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. వచ్చిన వారిని రహస్యంగా అనాథాశ్రమంలోకి పంపడానికి బ్రజేష్‌ ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశాడు. ఆశ్రమం నుంచి తన ఇంటికి మూడుచోట్ల మెట్లు కట్టుకున్నాడు. భోజనంలో మత్తుమందు కలిపి బాలికలపై అత్యాచారాలు సాగించడం, ప్రతిఘటించినవారిని తీవ్రంగా హింసించడం నిత్యం సాగింది. ఈ హింసకు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ నీచుల దాడిలో చనిపోయినట్టుగా భావిస్తున్నవారి మృతదేహాలేవీ పోలీసులకు ఇంకా దొరకనప్పటికీ, ఆశ్రమంలో దారుణాలు ఏ స్థాయిలో సాగాయో అర్థమవుతున్నది. మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం, అత్యాచారాలు చేయడం, గర్భం దాల్చిన బాలికలకు అక్కడే అబార్షన్‌లు చేయించడం ఠాకూర్‌ సృష్టించిన విషవలయంగా బయట పడింది. ఆశారామ్‌ బాపు, డేరాబాబా గుర్మీత్‌ సింగ్‌ను మించిన అకృత్యంగా దీనిని గుర్తించాలి. బిహార్‌లోని అనాథాశ్రమాల్లో టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) జరిపిన సామాజిక తనిఖీలో వెలుగు చూసిన తరువాత సీబీఐ జరుపుతున్న విచారణలో నిర్ఘాంతపోయే అంశాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఠాకూర్‌కు చెందిన అనాథాశ్రమంలోనే 11మంది యువతులు కూడా కనిపించకుండాపోయినట్టు ఆ తరువాత మరొక ఘోరం వెలుగుచూసింది. ఈ విషయం బయటకు పొక్కిన రెండునెలలకు కానీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకపోవడం విచిత్రం. నితీశ్‌ పార్టీతో ఆయనకు సత్సంబంధాలున్నాయనీ, ఈ కారణంగానే గత ఐదేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులెవ్వరూ ఈ ఆశ్రమంవైపు చూడలేదని విపక్షాలు

ఆరోపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 115 అనాథాశ్రమల్లో సామాజిక తనిఖీలు నిర్వహించిన ‘టిస్‌’ బృందం ఇతర చోట్ల కూడా అమానవీయమైన వాతావరణం నెలకొని ఉన్నదని అంటున్నది. మరో పదిహేను ఆశ్రమాల్లో తీవ్రమైన పరిస్థితులున్నట్టు చెబుతున్నది. బిహార్‌లో పదిహేను అనాథాశ్రమాలను మాత్రమే ప్రభుత్వం ప్రత్యక్షంగా నిర్వహిస్తుంటే, మిగతావన్నీ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి. అధికారులు తనిఖీలు చేయకపోవడం, స్థానిక కమిటీలు పట్టించుకోకపోవడంతో పరిస్థితులు దారుణంగా తయారైనాయి. ముజఫర్‌పూర్‌ ఘటనలో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ అధ్యక్షుడే నిందితుల్లో ఒకరు కావడం కంచే చేను మేస్తున్నదనడానికి నిదర్శనం. బాధిత బాలికలు అనాథలు, పేదలు, గొంతులేనివారు కావడంతో అనేక ఏళ్ళుగా ఈ దారుణం సాగిపోయింది. చట్టాలను అమలు చేయాల్సిన వ్యవస్థలన్నీ నేరగాళ్ళతో చేతులు కలుపుతున్నందున ఈ అమాయకులు బలైపోయారు. బిహార్‌ దారుణం దేశానికి ఓ హెచ్చరిక కావాలి. బిహార్‌లోనే కాదు, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా అనాథాశ్రమాల పరిస్థితులు దారుణంగా ఉన్నాయో తనిఖీలు నిర్వహించాలి. డేరాబాబా గుర్మీత్‌ను మించి సాగిన అత్యాచార కాండగా దీనిని గుర్తించాలి. దోషులను కఠినంగా శిక్షించినప్పుడే ఇలాంటి అఘాయిత్యాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టగలం. ఈ విసయంలో ఎలాంటి రాజీధోరణి అవలంబించినా అది జాతి ద్రోహంగానే చూడాల్సి ఉంటుంది.