అరుదైన వృక్షజాతులకు మళ్లీ జీవం

హరితహారం కోసం నర్సరీల్లో పెంపకం
ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా అరుదైన అంతరించిపోతున్న  మొక్కలను అటవీ శాఖ అధికారులు నాటనున్నారు. ఇందుకోసం నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెపంకం చేపట్టారు.  ఔషధ గుణాలున్న అరుదైన తెల్లమోదుగ చెట్లు జిల్లా అడవుల్లో పది వరకు ఉన్నట్లు గుర్తించారు. గతంలో వృక్ష శాస్త్రవేత్తలు తెల్ల మోదుగపై అధ్యయనం చేసి రెడ్‌జోన్‌ కింద గుర్తించారు.  తాజాగా జిల్లా అటవీశాఖ అధికారులు, వృక్షశాస్త్ర వేత్తలు సంయుక్తంగా జిల్లా అడవుల్లో ఔషధ మొక్కలపై అధ్యయనం చేశారు. ఈ చెట్ల నుంచి విత్తనాలను సేకరించి నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. తలమడుగు మండలం కుచులాపూర్‌లో ఒకచెట్టు, భీంపూర్‌ మండలం నిపాని అటవీలో ఒక చెట్టు, దేవాపూర్‌ అడవిలో రెండు చెట్లు, బేల అడవిలో రెండు, కోసాయిలో రెండు ఉన్నట్లు వృక్షశాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నుంచి విత్తనాలను సేకరించి జిల్లాలోని పలు నర్స రీల్లో ఇప్పటికే మొక్కలను పెంచుతున్నారు. అడవులను దట్టంగా తీర్చిదిద్దడంతో పాటు ఔషధ మొక్కల రక్షణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వృక్ష శాస్త్రవేత్తలు జిల్లా అడవుల్లో అధ్యయనం చేశారు. ఎలాంటి చెట్లు ఉన్నచోట ఏ రకమైన జంతువుల ఉత్పత్తి పెరిగింది? అనే అంశాల ను తెలుసుకున్నారు. దేశంలో అంతరిస్తున్న ఔషధ మొక్కలను కూడా గుర్తించారు. అరుదైన ఔషధ గుణాలున్న తెల్ల మోదుగ అంతరించి పోతున్నట్లు గతంలో వృక్షశాస్త్రవేత్తలు
గుర్తించారు. కాగా.. తాజాగా అటవీ శాఖ అధికారులతో పాటు వృక్షశాస్త్రవేత్తలు జిల్లా అడవుల్లో జంతువులకు ఉపయోగపడే వృక్షజాతులు, ఔషధ గుణాలున్న చెట్లను గుర్తించేందుకు అధ్యయనం చేశారు. ఔషధ గుణాలు, ప్రకృతి వైద్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన తెల్ల మోదుగకు అనేక రకాల వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. గతంలో ఈ చెట్లు జిల్లా అడవుల్లో ఉండేవి. రానురాను తెల్ల మోదుగ చెట్లు అంతరించిపోయాయి. జూన్‌ మాసంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ మొక్కలను నాటనున్నారు. ఇప్పటికే స్థలాలను కూడా అటవీశాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ రహదారుల గుండా ఈ మొక్కలను నాటుతారు. ఎర్ర మోదుగ, తెల్లమోదుగ చెట్లను రోడ్లకు ఇరువైపులా నాటడంతో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లమోదుగ చెట్టు ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు.