అర్థవంతమైన ప్రశ్నలు అడగండి

బిజెపి సభ్యుడికి స్పీకర్‌ చురక

న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అనవసరమైన ప్రశ్నలు అడిగి సభా సమయాన్ని వృధా చేయకుండా అర్థవంతమైన ప్రశ్నలు అడగాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులకు సూచించారు. సోమవారం భాజపా సభ్యుడు అడిగిన ప్రశ్నల పట్ల స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాజపా నేత గుమన్‌ సింగ్‌ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లోని రాత్లాం ప్రాంతంలో ఉన్న పాత ఆలయాలను పునరుద్ధరించాలని కోరారు. దీనికి సాంస్కృతికశాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పాటిల్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మంత్రి పాటిల్‌ ఇచ్చిన సమాధానం పట్ల సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెదవి విరిచారు. పాతబడిపోయిన ఆలయాలను పట్టించుకోవాలని ఆయన మరో ప్రశ్న అడగ్గా స్పీకర్‌ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. మంచి ప్రశ్నలు అడగాలని సభ్యులకు సూచించారు. అలాగే స్థానికంగా ఉన్న ఆలయాల అంశాలు రాష్ట్ర ప్రభుత్వం కిందకు వస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండవని వెల్లడించారు.