అలిపిరి ఘటనలో బిజెపి నేతలపై కేసులు

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నేతలు
హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. అలిపిరిలో అమిత్‌షా కాన్వాయ్‌పై దాడి తరువాత బీజేపీ నాయకుల విూద కేసులు పెట్టడంపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతల వినతి చేశారు. కావాలనే తమ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌ను కలుసుకున్న వారిలో సోము వీర్రాజు, మాణిక్యాలరావు, దినేష్‌ రెడ్డి ఉన్నారు. ఇదిలావుంటే భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఆయన కాన్వాయ్‌పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ అమిత్‌షాకు రక్షణగా ఉన్న తమ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి వ్యక్తికీ బీజేపీతో లింక్‌ పెడుతున్నారని, టీటీడీలో అక్రమాలు జరిగాయంటే ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. టీటీడీలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు.