అవకాశవాద రాజకీయాలపట్ల..

బీసీలంతా అప్రమత్తంగా ఉండాలి
– కృష్ణయ్య బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నాడు
– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తొస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. బీసీలు రాజ్యాంగ పదవులు చేపట్టకూడదా అని ప్రశ్నించారు. అవకాశవాద బీసీ రాజకీయ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్యపై వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్‌ దగ్గరనున్న ఆయన.. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి దగ్గరకు వెళ్లారంటూ మండిపడ్డారు. కేవలం బీసీ నాయకుడివనే రాహుల్‌ గాంధీ.. మిర్యాలగూడ సీటు ఇచ్చారన్న వీహెచ్‌ పేర్కొన్నారు. మరి ఏపీలో బీసీలకు ఎక్కువ సీట్లు కావాలని కృష్ణయ్య ఎందుకు నిలదీయలేదని వీహెచ్‌ ప్రశ్నించారు. కృష్ణయ్య అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతుందని, అవకాశవాద బీసీ రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వీహెచ్‌ విజ్ఞప్తి చేశారు. బీసీలు రాజ్యాంగ పదవులు చేపట్టరాదా అని వీహెచ్‌ ప్రశ్నించారు. కుల వృత్తికే పరిమితం కావాలా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనే అన్ని పార్టీల నేతలకు బీసీలు గుర్తుకు వస్తారని సెటైర్లు వేసిన వీహెచ్‌.. చేసేది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ దీర్ఘకాలిక ఆలోచనలు చేస్తోందని అన్నారు. బీసీలకు పెట్టిన క్రివిూలేయర్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తెచ్చిపెట్టి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని కార్యకర్తలకు వీహెచ్‌ పిలుపునిచ్చారు.