అవినీతి రహిత పాలన అందిస్తాం


` కశ్మీర్‌ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
శ్రీనగర్‌,అక్టోబరు 23(జనంసాక్షి): జమ్మూ`కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) చేసి తీరతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. తదనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని, ఆపై రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని వెల్లడిరచారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం హోం మంత్రి శనివారం కశ్మీర్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్థానిక యూత్‌ క్లబ్‌ల సభ్యులతో సంభాషించారు. కశ్మీర్‌ లోయలో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని.. స్థానికంగా శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతకు ఉపాధి అవకాశాలూ పెంచుతామన్నారు. ఇక్కడి ప్రతి పంచాయతీలో యూత్‌ క్లబ్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి యూత్‌ క్లబ్‌కు రూ.25 వేలు అందజేస్తామని తెలిపారు.‘కశ్మీర్‌లో నూతన శకం మొదలైంది. ఉగ్రవాదం, అవినీతి పాలన, కుటుంబ రాజకీయాల నుంచి శాంతి, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు వైపు అడుగులు పడుతున్నాయి. కశ్మీర్‌ యువత సైతం ఈ మార్పును ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఉగ్రవాదం తగ్గింది. రాళ్ల దాడులు కనిపించకుండా పోయాయి’ అని అమిత్‌ షా అన్నారు. 2019 నుంచి స్థానికంగా పారదర్శకమైన, అవినీతి రహిత పాలన సాగుతోందని.. ఆర్టికల్‌ 370 రద్దు చేయకుండా ఇవన్ని సాధ్యమయ్యేవేనా అని మంత్రి ప్రశ్నించారు. అంతకుముందు మంత్రి శ్రీనగర్‌లో భద్రతపై సవిూక్షా సమావేశం నిర్వహించారు. జమ్మూ`కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో జమ్మూ` కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత అమిత్‌ షా ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.