అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నాం

ఆదాయం పెంచి సంక్షేమానికి వెచ్చిస్తున్నాం

రైతులకు 24 గంటల ఉచిత కెరంట్‌ ఇస్తున్నాం

రైతుబందు, రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు

పాలకుర్తి సభలో సిఎం కెసిఆర్‌

పాలకుర్తి,నవంబర్‌19(జ‌నంసాక్షి): దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు 100 టీఎంసీల నీటిని తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్‌ నాలుగేళ్లలోనే రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం అని అన్నారు. దేశంలో ఎక్కడా రైతుబందు, రైతుబీమా ఇస్తున్నారా అని సిఎం కెసిఆర్‌ ప్రశ్నించారు. ఆదాయం పెంచుతూ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని అన్నారు. అవినీతి లేకుండా పనిచేస్తున్నాం గనకనే ఇన్ని కార్యక్రమాలు చేయగలిగామన్నారు.

డిసెంబర్‌ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని పాలకుర్తి నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతులను నానా బాధలకు గురిచేశాయని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. సమయానికి కరెంట్‌ ఇవ్వకపోవడంతో నాడు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ప్రపంచ మేధావి అయిన చంద్రబాబు, ఘనాపాటీలు అయిన కాంగ్రెస్‌ నేతలు తమ ప్రభుత్వాల హయాంలో రైతులకు ఎందుకు కరెంట్‌ ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తోందని చెప్పారు. రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇస్తామన్నారు. పెన్షన్లు రెండింతలు పెంచుతామని ప్రకటించారు. అదేవిధంగా నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్‌ హయాంలో దోచుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే సొంత స్థలం ఉన్నవారికి ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తీసుకొస్తామని చెప్పారు. సంపద పెంచాం.. పేదలు, రైతులకు పంచుతున్నామని అన్నారు. పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ, రిజర్వాయర్‌ నిర్మిస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. ఈ జన ప్రవహాన్ని చూస్తుంటే అద్భుతమైన మెజార్టీతో దయాకర్‌ గెలుపు ఖాయం అన్నారు. దయాకర్‌ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హుషారున్న మనిషి. మంచి ఎమ్మెల్యే. దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లా సస్యశ్యామలం అవుతది. మల్కాపూర్‌ లింగంపల్లి రిజర్వాయర్‌ తెచ్చాం. కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల పూర్తి అవుతున్నాయి. దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకే 100 టీఎంసీల నీళ్లు రాబోతున్నాయి. కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ వస్తే కరెంట్‌ పోతది. జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. గతంలో పాలన చేసిన కాలంలో కాంగ్రెస్‌, టీడీపీలు ఎందుకు 24 గంటల కరెంట్‌ ఇవ్వలేకపోయాయని అన్నారు. టీఆర్‌ ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి గ్రామాల్లో ప్రజలు ఉపన్యాసాలుగా చెబుతున్నారు. రైతుబంధును ఐరాస గుర్తించింది. రెండు పంటలకు ఏడాదికి రూ. 8 వేలు ఇచ్చాం. వచ్చే ప్రభుత్వం పది వేలు ఇవ్వబోతున్నాం. పెన్షన్లు రూ. 2016కు పెంచబోతున్నాం. వికలాంగులకు రూ. 3016కు పెంచాం. నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి కింద రూ. 3016లు ఇవ్వబోతున్నాం. ప్రాణం పోయినా అబద్దాలు చెప్పను. డబుల్‌ బెడ్‌ ఇండ్ల పథకం ప్రవేశపెట్టిన అంటే దాని వెనుక పెద్ద ఉద్దేశం ఉంది. ఆడవాళ్లు, భవిష్యత్‌ తరాలు గౌరవంగా ఉండేలా డబుల్‌ రూం ఇండ్లు కడుతున్నాం. ఒక్క రూపాయి తీసుకోకుండా ఇండ్లు కట్టిస్తున్నాం.

సొంత జాగ ఉన్న వాళ్లకు డబుల్‌ బెడ్‌ ఇండ్లు కట్టించే విధంగా వెసులుబాటు కల్పిస్తాం. సంపద పెంచి పేదలకు, రైతులకు పెంచుతున్నాం. మహిళా సంఘాలు బ్రహ్మాండంగా పని చేస్తున్నాయని కేసీఆర్‌ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలను వంద శాతం అమలు చేసి చూపించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ సందర్భంలో చెప్పిన విషయాలన్నీ జరుగుతున్నాయి. రూపాయి కూడా తీసుకోకుండా వంద శాతం సబ్సిడీతో ఇండ్లు కట్టిస్తున్నాం. ఆడవాళ్ల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ఇండ్లు నిర్మిస్తున్నాం. ఆర్నేళ్లు ఆలస్యం కావొచ్చు కానీ.. ఒకసారి ఇల్లు వచ్చిందంటే 60 ఏండ్ల వరకు ఇల్లు లేదనే బాధ తీరిపోతుందన్నారు. ఇవాళ బరిలో ఉన్న పెద్దలు 58 ఏండ్లు పాలించారు. టీఆర్‌ఎస్‌ వచ్చింది 2014లో. కానీ ఈ నాలుగున్నరేండ్లలో అనేక సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేశాం. అవకాశం ఉన్న కూడా అభివృద్ధి చేయలేదు వారు. రూ. 43 వేల కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అలాగే ఒక్క ఇసుకనే తీసుకుంటే కాంగ్రెస్‌ హయాంలో పదికోట్ల ఆదాయం వస్తే ఈ నాలుగేళ్ల టిఆర్‌ఎస్‌ పాలనలో2వేల కోట్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చన్నారు.

అంతకు ముందు ఎర్రబెల్లి మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రవేశపెట్టన పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడూ జరగనంత పెద్ద ఎత్తున సభ జరుగుతుందని అన్నారు. ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అందరి దేవుళ్ల ఆశీర్వాదంతో కేసీఆర్‌ తొలి సభ ఇక్కడ పెట్టడం జరిగిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. గోదావరి జలాలను తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, ఇంకా కొన్ని గ్రామాలకు నీరు అందించాల్సి ఉందని, మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందని ఎర్రబెల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో ఎంతో అభివృద్ది జరిగిందని ఆయన అన్నారు.