అవి పురుగులు కాదు జీలకర్ర

కోల్‌కతా(జ‌నం సాక్షి): మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయని గుర్తించిన విద్యార్థులు ఆ విషయాన్ని తమ టీచర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అవి పురుగులు కాదు జీలకర్ర అని ఆ టీచర్‌ అనడంతో వారంతా షాక్‌ అయ్యారు. దీంతో ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాల వద్దకు చేరుకున్న వారు.. ఏడాదిగా ఆ టీచర్లు ఇలాగే ప్రవర్తిస్తున్నారని ఆందోళనకు దిగారు. పశ్చిమ్‌బెంగాలోని ముర్షిదాబాద్‌ జిల్లా, హసిమ్‌పుర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయని టీచర్‌కి చెప్పాను. నేను చెప్పిన విషయాన్ని కొట్టిపారేసిన టీచర్‌.. అవి జీలకర్ర అని చెప్పారు’ అని నాలుగో తరగతి విద్యార్థి రోహిత్‌ సిన్హా మీడియాకు తెలిపాడు. మరో విద్యార్థి కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.

ఈ ఘటనపై ఓ విద్యార్థి తల్లి స్వప్న మాట్లాడుతూ.. ‘పాఠశాలల్లో ఇటువంటి ఆహారం పెడితే, మా పిల్లలు పరిస్థితి ఏంటీ?’ అని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోకపోతే తాము ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఏడాది కాలంగా పాఠశాలలో నాణ్యతలేని ఆహారమే పెడుతున్నారని, అధికారులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదని వారు ఆరోపించారు. ఈ ఘటనపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందించలేదు. కాగా, ఇటీవల దేశంలోని పలు పాఠశాలల్లోనూ ఇటువంటి ఘటనలు అధికమవుతున్నాయి. ‌