అసౌకర్యాలతో రెడ్యాల ఆశ్రమ పాఠశాల 

 సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు
 పట్టించుకోని జిల్లా అధికారులు
మహబూబాబాద్ బ్యూరో ఆగస్టు20 (జనంసాక్షి):మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఐటిడిఎ ద్వారా  చేపడుతున్న ఆశ్రమ పాఠశాలల నిర్వహణ జిల్లా అధికారుల నిర్లక్ష్యం మూలంగా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది.మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. దీంతో విద్యార్థులు చదువుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాఠశాలలు  ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ నేటికీ సరిపడా పాఠ్య పుస్తకాలు రాకపోవడంతో సిలబస్ జరగక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు.3వ తరగతి నుండి 10వ తరగతి వరకు రావాల్సిన పాఠ్యపుస్తకాలు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు కేవలం నోట్ పుస్తకాల మీదనే విద్యార్థులు ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు.విద్యాభ్యాసం కు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి తెలుగు, హిందీ, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులను తక్షణమే నియమించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నియమించకుండా జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.సెప్టిక్ ట్యాంకు నిండి దుర్గంధం వెదజల్లుతోందని,టాయిలెట్కు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థులు పేర్కొంటున్నారు.విద్యార్థుల సంఖ్యకు సరిపడా టాయిలెట్స్ లేకపోవడంతో మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థులు ఉపాధ్యాయులు వాపోతున్నారు. తరగతి గదిలో డుయెల్ డెస్క్ బెంచీలు లేక వరండా పైనే కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది.ఆశ్రమ పాఠశాలకు ప్రభుత్వం సరఫరా చేసే బియ్యంలో మెరికలు, రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు రాళ్లు మెరిగలతో వస్తున్న బియ్యాన్ని తినలేకపోతున్నామని పేర్కొంటున్నారు.విద్యార్థులు స్నానాలు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన నల్లా కలెక్షన్లు ఏ మాత్రం పనిచేయడం లేదని విద్యార్థులు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.పాఠశాల ప్రాంగణం చుట్టూ ప్రహారి గోడ లేకపోవడంతో ప్రధాన ఎంట్రెన్స్  ముందు గేటు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పేర్కొంటున్నారు.పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు అనేక సార్లు డిటిడిఒ ప్రియాంక దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు పేర్కొంటున్నారు.డిటిడిఓ ప్రియాంక పర్య క్షణ లేకనే సమస్యలు తలెత్తుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.ఇప్పటికైనా జిల్లా రాష్ట్ర అధికారులు స్పందించి రెడ్యాల ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్తులు పలువురు పేర్కొంటున్నారు
 సమస్యలను డిటిడిఓ దృష్టికి తీసుకెళ్లాను
 కల్తీ లింగయ్య  ఎఫ్ఏసీ  హెచ్ఎం
రెడ్యాల ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను డిటిడిఓ దృష్టికి తీసుకెళ్లాను పాఠశాల ప్రహరీ గోడ ప్రధాన ఎంట్రెన్స్ గేటు పాఠ్యపుస్తకాల అంశాలపై అనేక సార్లు వినతి పత్రాన్ని సమర్పించారు .సెప్టిక్ ట్యాంక్ నిండిన దాని గురించి చర్చించాను వారు సానుకూలంగా స్పందించారు త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయాని ఆయన పేర్కొన్నారు