అస్తవ్యస్థంగా డ్రైనేజీ వ్యవస్థ

పట్టణాల్లో మారని పరిస్థితులు

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): దశాబ్దాల కాలంగా మున్సిపల్‌ పట్టణాలకు డ్రైనేజీలకు వెచ్చిస్తున్న నిధులు నిష్ఫలం అవుతున్నాయి. నిధులు ఖర్చు అవుతున్నా మురుగు నీటికి పరిష్కారం లభించడం లేదు. ఇలా పెద్ద నగరాల్లో సైతం డ్రైనేజీ అవ్యవస్థను చూస్తే ఈ అనుమానాలు కలగకమానవు. దశాబ్ద కాలంలో సుమారుగా కోట్ల వరకు వ్యయం చేసి ఉంటారని అంచనా. ఏటా బల్దియాకు విడుదలయ్యే నిధుల్లో మొదటి ప్రాథమ్యంగా డ్రైనేజీలకే కేటాయిస్తుంటారు. ఇన్ని నిధులు కేటాయించినా ప్రణాళిక లేని నిర్మాణాలతో నిధులు నిష్పయ్రోజనంగా మారుతున్నాయి. అసంపూర్తి డ్రైనేజీలు, నివాసాల మధ్య ఖాళీ స్థలాల్లో మురుగు గుంతలు అభివృద్ధిని వెక్కిరిస్తుంటాయి. ఏటా కోట్ల నిధులు ఖర్చుచేస్తున్నా ఏ కాలనీకి మురుగు నుంచి విముక్తి దక్కడంలేదు. కాలువల నిర్మాణం చేపట్టే సమయంలో నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవడం, నాణ్యతకు తిలోదకాలివ్వడంతో మురుగు నీటి పారుదల వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. వరంగల్‌,హన్మకొండల్లో పాత కాలువల స్థానంలో కొత్తవి వేస్తున్నా పైపులు వేయకుండా మళ్లీ ఓపెన్‌ డ్రైనేజీ కొనసాగిస్తున్నారు. నిజామాబాద్‌లో కూడా అలాగే చేస్తున్నారు. దీంతో మల్లీ చెత్తాచెదారం నిండడం మినహా ప్రయోజనం ఉండదు. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, ప్రణాళిక, ప్రణాళికేతర, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక పద్దుల కింద వచ్చిన నిధులతో వీటి నిర్మాణాలుచేపట్టారు. ఈ ఒక్క ఏడాదిలోనే పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. అంతకుముందు వివిధ పథకాల్లో వచ్చిన నిధులు ఈ పనులకే వెచ్చించారు. ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో బెటర్‌మెంట్‌, డెవలప్‌మెంట్‌ పేరిట రుసుములు వసూలు చేస్తారు. ఇందుకు తగ్గట్లుగానే మురుగు కాలువలు, రహదారులు, తాగు నీటి సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. లేఅవుట్‌ లేకుండా రోజుకో కాలనీ పుట్టుకొస్తున్న తరుణంలో భగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చిన నిధులతో నిర్మిస్తున్న డ్రైనేజీలు ప్రణాళికా బద్ధంగా ఉండటంలేదు. వచ్చిన నిధులతో డ్రైనేజీలు నిర్మించామా లేదా అన్నదే ప్రధానంగా మారింది. నిధుల రాకను బట్టి ఒక్కో వీధికి ఒక్కోసారి ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రమాణాలు పాటించకుండా నిర్మిస్తున్న కాలువలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటం లేదు. నిధులు బురదలో పోసినట్లవుతుంది. పట్టణానికి మురుగు సమస్య తీరడం లేదు. మున్సిపాలిటీలకు పురపాలక మంత్రి కేటీఆర్‌ రూ.50కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే నిధుల్లో ప్రతిపాదించే డ్రైనేజీలక సరైన మార్గం చూపించాలని కోరుతున్నారు.