ఆంధప్రదేశ్‌ మహిళాంధ్రప్రదేశ్‌గా మారాలి

– మహిళలపై దాడి చేసిన వారికి బెయిల్‌ ఇవ్వొద్దు
– ఆడపిల్లల జొలికిరావాలంటే వెన్నులో వణుకు పెట్టేలా చట్టాలుండాలి
– ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా
అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్రం మహిళాంధ్ర ప్రదేశ్‌గా మారాలని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు మహిళల రక్షణకు సంబంధించిన అంశంపై నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. దిశ ఘటన తర్వాత తొలిసారిగా ఏపీలో మహిళా భద్రతపై చర్చ జరుగుతుంటే దేశమంతా ఈ అసెంబ్లీలో ఎలాంటి చట్టాలు చేస్తారు? మనకు ఎలా భద్రత కల్పిస్తారని మహిళలంతా ఎదురు చూస్తున్నారన్నారు. మొన్న ‘దిశ’ను అత్యాచారం చేసి చంపి దహనం చేసిన విధానం చూస్తుంటే మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కన్నీళ్లొస్తాయన్నారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారనీ.. ఆడ పిల్లలు కాలేజీలకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొందన్నారు. నిన్న దిశ.. మొన్న రిషితేశ్వరి, ఆ ముందు నిర్భయ.. అంతకన్నా ముందుచూస్తే స్వప్నిక, ప్రణీత.. రేపు ఈ మృగాళ్లకు బలి కావాల్సింది ఎవరో అన్న భయంతో కంటిపై కునుకు లేకుండా మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళను అడవిలో వదిలేసి వస్తే భద్రంగా బయటకు వచ్చే అవకాశం ఉందేమో గానీ.. పొద్దున్న లేచి బయటకు వెళ్తే మాత్రం ఈ సమాజంలో తిరిగి వస్తుందనే నమ్మకం లేకపోవడం చాలా దురదృష్టకరమని రోజా ఆవేదన వ్యక్తంచేశారు. ఆడ పిల్లకు కష్టం వచ్చేలోపు గన్‌ వచ్చేకంటే ముందే జగన్‌ వచ్చి రక్షిస్తాడనే ఒక నమ్మకం ప్రజలకు కావాలన్నారు. ఆడపిల్ల కళ్లల్లో కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఆవిరయ్యేలోపు వారికి శిక్ష వేస్తారన్న నమ్మకాన్ని ఈ అసెంబ్లీ ద్వారా ఇవ్వాల్సిన అవసరముందని, మహిళలు బతికి బట్టకట్టాలంటే సత్వర న్యాయం కావాలన్నారు. సత్వర న్యాయం జరగకుండా ఆలస్యమైతే అది అన్యాయంగా మారిపోతుందని రోజా అభిప్రాయపడ్డారు. జగనన్నను ఒకటే కోరాలనుకుంటున్నా అని, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే వారికి వెన్నులో వణుకు పుట్టేలా ఒక చట్టాన్ని తేవాలని రోజా కోరారు. ఆంధప్రదేశ్‌ అంటే ఆడవాళ్ల ప్రదేశ్‌గా మారాలని, ఏ రాష్ట్రంలోనైనా ఆడ పిల్లకు భయం వేస్తే ఏపీలో మనకు రక్షణ ఉంటుందన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చరిత్రలోనే రెండు చోట్ల నుంచి నిలబడి ఓడిపోయిన గొప్ప నాయకుడని, ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సభలో ఉన్నారని, ఆయన ద్వారా పవన్‌కు చెప్పాలనుకుంటున్నా.. అత్యాచారం చేసిన వారిని ఉరితీయడమేంటి? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు అంటున్నారని అన్నారు. గతంలో ఏం జరిగిందని పవన్‌ రివాల్వర్‌ పట్టుకొని రోడ్లపైకి వచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందని రోజా ప్రశ్నించారు. మా అక్కను అవమానిస్తే వారిని చంపాలనిపించిందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పినదాన్నీ మనం విన్నామన్నారు. అయితే, ఆమె వ్యాఖ్యలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావన వద్దని రోజాను వారించారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. మహిళల భద్రతపై చట్టం తేవాలని చర్చజరిగేందుకు స్పీకర్‌ అనుమతిస్తే టీడీపీ నేతలు వద్దు ఉల్లిపై చర్చ జరపాలని అంటున్నారని, ఆడపిల్లల భద్రత అంటే టీడీపీ ఉపయోగంలేని అంశంగా భావించడం దుర్మార్గమన్నారు. బాలకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలు, లోకేష్‌ బీచ్‌ వ్యవహారాలు, చింతమనేని వ్యవహారం మళ్లీ అసెంబ్లీలో చర్చకు ఎక్కడ వస్తాయోనని టీడీపీ భయపడిందని రోజా విమర్శించారు. టీడీపీ సభ్యుల తీరు మార్చుకోవాలని రోజా సూచించారు.