ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు

హైదరాబాద్‌,నవంబరు 26(జనం సాక్షి): ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్నది. భవిష్యత్తులో మరింత ధరలు పెరిగే అవకాశం ఉండడంతో అటు సామాన్యులు ఇటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల నుంచి ధరలు అమాంతంగా పెరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. రోజు రోజుకూ ధరలు ఆకాశాన్ని అంటుతుండగా ఉల్లి కోయక ముందే ధర వింటేనే కన్నీళ్లు తెప్పిస్తున్నది. ప్రస్తుత మార్కెట్‌లో ధర రూ.100కి చేరుకుంది. అలాగే వెల్లుల్లి కూడా రూ.200లకు చేరుకుంది. ఉల్లి మహారాష్ట్రలోని నాసిక్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుంది. వర్షాకాలం సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్దేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వెల్లుల్లి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా డిమాండ్‌ను బట్టి మార్కెట్‌లో ఉల్లి దిగుమతి కాకపోవడంతో ఉల్లికి డిమాండ్‌ పెరిగింది. దీంతో అన్ని ప్రాంతాల్లో ఉల్లి ధర గణనీయంగా పెరిగింది. ఆగస్టులో కేజీ ఉల్లిగడ్డలు రూ.30 ఉండగా కేవలం రెండు నెలల్లోనే రూ.100కి చేరుకుంది. ఇక వెల్లుల్లి కేజీ రూ.120 ఉండగా ప్రస్తుతం రూ.200కు చేరుకుంది. ఈ ధరల పెరుగుదలతో మార్కెట్‌లో వ్యాపారం తగ్గినట్లు చిరు వ్యాపారులు పేర్కొంటున్నారు. గతంలో వేల క్వింటాళ్ల ఉల్లి లారీల లోడు వచ్చేది. ప్రస్తుతం వారంలో ఒకసారి మాత్రమే దిగుమతి చేస్తున్నారు.