ఆటోస్టార్టర్ల తొలగింపుపై ప్రచారం

జయశంకర్‌ భూపాలపల్లి, నవంబర్‌17(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జనవరి 1నుంచి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా అమల్లోకి తెస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిననేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో విద్యుత్‌ సంస్థ అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ప్రయోగాత్మక సరఫరా విజయవంతం కావడంతో ఇప్పుడు లోటుపాట్లపై దృష్టి సారించారు. రైతులు తమ పంపుసెట్లకు అమర్చిన ఆటో స్టార్టర్లను తొలగించాలని కోరారు. జిల్లాలో 33/11కేవీ సబ్‌స్టేషన్లు 64 ఉన్నాయి. చిట్యాల, కాటారం, మంగపేట మండలం కమలాపురం, ములుగు, గణపురం మండలం చెల్పూరు వద్ద 132/33కేవీ సబ్‌స్టేషన్‌లు పనిచేస్తున్నాయి. ఎత్తిపోతల కోసం కన్నాయిగూడెం మండలం దేవాదుల ఇంటేక్‌వెల్‌, భూపాలపల్లి మండలం భీంగణపురం రిజర్వాయర్‌ వద్ద 220/11కేవీ సబ్‌స్టేషన్ల ద్వారా విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. అదనంగా జిల్లాలో ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు మరికొన్ని 33/11కేవీ సబ్‌స్టేషన్లు కూడా నిర్మిస్తున్నారు.2014వరకు అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయానికి కేవలం ఏడు గంటల విద్యుత్‌ మాత్రమే సరఫరా చేశాయి. ఇందులో పగలు నాలుగుగంటలు, రాత్రి వేళ మూడు గంటల విద్యుత్‌ ఇచ్చాయి. రాత్రివేళ విద్యుత్‌ సరఫరాతో రైతులు ప్రమాదాలకు గురయ్యారు. పగలు, రాత్రి వేళ సరఫరా చేసిన విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో పంపుసెట్ల వద్ద వేచి ఉండలేక రైతులు ఆటో స్టార్టర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ సరఫరా జరిగిన సమయంలో ఈ ఆటోస్టార్టర్ల ద్వారా పంపుసెట్లు తమ పంటలకు నీరందించే ఏర్పాట్లు చేశారు. డిసెంబర్‌ నెలాఖరు లోగా రైతులందరు కూడా ఆటో స్టార్టర్లను తొలగించాలని కోరారు. శాసనసభలో సీఎం 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రకటించడంతో ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు ఆటో స్టార్టర్ల తొలగింపుపై రైతులను కలుస్తున్నారు. ఆటో స్టార్టర్ల వినియోగం వల్ల జరిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. రైతులు కూడా వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరాకు ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా ఆటో స్టార్టర్లు తొలగించాలనే సీఎం కేసీఆర్‌ పిలుపునకు సానుకూలంగా స్పందిస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 24గంటల విద్యుత్‌ సరఫరా కానుండటంతో ఆనందం వెలిబుచ్చు తున్నారు. దీంతో రానున్న కాలంలో ఇక రాత్రిళ్లూ పొలం గట్టపై పడిగాపులు పడే బాధలు దూరం కానున్నాయి.