ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుదాం

సర్పంచ్‌లే కీలక భూమిక పోషించాలి
ఖమ్మం,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :    మన ప్లలెలను మనమే ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చింది.. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు గ్రామ సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు అన్నారు. ప్లలెల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై సర్పంచ్‌ల బాధ్యత ముఖ్యమని అన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేందుకు నియంత్రిత పద్ధతుల్లో , విస్త్రృత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆకాంక్షించిన మేరకు 30 రోజుల్లో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలలో అవసరమైన పనులు గుర్తించి, వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందిం చాలన్నారు.తదనుగుణంగా పనులు చేపట్టేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు సేవా దృక్పథంతో పనిచేయాలని కమల్‌రాజు అన్నారు. మన గ్రామాలను మనమే బాగుచేసుకునే సువర్ణ అవకాశం లభించిందని, ప్రభుత్వం పంచాయతీలకు కల్పించిన విస్తృత అధికారాలను పూర్తిగ సద్వినియోగం చేసుకొని 30 రోజుల ప్రణాళికతో గ్రామాభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అన్నారు. పారిశుధ్య పనులను ముమ్మరం చేయడం, హరితహారం క్రింద మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవడం, గ్రామాలలోఏని విద్యుత్‌ దీపాలకు సంబంధించిన మరమ్మతు పనులు చేపట్టడంతో పాటు గ్రామాలలో గుర్తించిన ఇతన అవసరమైన పనులను 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో రూపొందించుకొని సంబంధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపట్టేందుకు సర్పంచ్‌లు సహకరించాలని అన్నారు.