ఆదిలాబాద్‌లో జోరుగా ప్రచారం

 

జోగురామన్నకు మద్దతుగా నేతల పరుగులు

టిఆర్‌ఎస్‌తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న జోగు

అదిలాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం జట్‌ స్పీడ్‌ తో కొనసాగుతుంది. అదిలాబాద్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి జోగు రామన్నకు మద్దతుగా పలువురు టీఆర్‌ఎస్‌

నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు విడతలుగా నియోజకవర్గంలో మంత్రి జోగు రామన్న ఎన్నికల ప్రచారం పూర్తి అయ్యింది. జోగు రామన్నకు మద్దతుగా ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ లోక భూమారెడ్డి, అదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రంగినేని మనీషా, జోగు షౌండేషన్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు, మహిళలు.. తాటిగూడలో ఇంటింటా తిరుగుతూ మంత్రి జోగు రామన్నకు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా భూమారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీని అదిలాబాద్‌ జిల్లా ప్రజలు తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారన్నారు. ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లిన ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు తెలుపుతూ కారు గుర్తుకు ఓటేస్తామని హామి ఇస్తున్నారని తెలిపారు. డెభ్బై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఆదివాసీ గూడాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.. కానీ నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ప్రతి గూడానికి రోడ్డు సౌకర్యం కల్పించాం, మిషన్‌ భగీరథతో మంచినీటి సౌకర్యాన్ని కల్పించామని మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని ఖండాల, సాలెగూడ, సాలేటిగూడా, ఎస్సీ గూడా, లోహారతో పాటు తదితర మారుమూల గ్రామాల్లో మంత్రి జోగు రామన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర రైతులకు సైతం రైతుబంధు పథకం అమలు చేసి నగదు అందిస్తున్నామని చెప్పారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన కొమ్రం భీం స్మారకార్థం జోడేఘాట్‌లో రూ. 25 కోట్లతో స్మృతి వనాన్ని నిర్మించడంతో పాటు జోడేఘాట్‌కు వచ్చి నివాళులర్పించిన తొలి సీఎం సైతం కేసీఆర్‌ కావడం విశేషమన్నారు. మారుమూల గ్రామాలైన ఖండాల, కాన్పు తదితర గ్రామాలను కలుపుతూ రూ. 5 కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని జోగురామన్న తేల్చిచెప్పారు.