ఆనందపురం రైస్‌ మిల్లుపై విజిలెన్సు దాడులు

విశాఖపట్నం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): విశాఖ ఆనందపురం మండలంలోని శొంఠ్యాం గ్రామసవిూపంలో గల నాగేంద్ర రైస్‌ మిల్లుపై విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు మిల్లులో 685 బస్తాల పీడీఎఫ్‌ బియ్యాన్ని పట్టుకున్నారు.అనంతరం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు ఎస్పీ వి.కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయనగరం ప్రాంతం నుంచి శొంఠ్యాంలో గల రైస్‌మిల్లుకు పీడీఎఫ్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో నాగేంద్ర రైస్‌మిల్లులో దాడులు నిర్వహించామని అన్నారు. ఇందులో 685 బస్తాలు (25టన్నులు) పీడీఎఫ్‌ బియ్యం, 1286(25కిలోలు) బస్తాల బ్రాండెడ్‌ బియ్యం అక్రమంగా అమ్మకం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అక్రమంగా అమ్మకం చేస్తున్న బియ్యాన్ని, పౌరసరఫరాల బియ్యాన్ని సీజ్‌ చేయటంతో పాటు రైస్‌మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి ఆర్డీవో కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డీఎస్పీ సీ.ఎమ్‌. నాయుడు, సీఐలు ఎన్‌.శ్రీనివాసరావు, ఆర్‌.మలిఖార్జునరావు, డిప్యూటీ అసిస్టెంటు కమిషనర్‌లు రేవతి, మోహనరావు, పౌర సరఫరా విభాగం తహసీల్దారు సుమబాల పాల్గొన్నారు.