ఆరే కాలనీలో చెట్లు నరకొద్దు

– మహారాష్ట్ర సర్కార్‌కు సుప్రీం ఆదేశం
– విచారణ 21కి వాయిదా
ముంబయి, అక్టోబర్‌7  జనం సాక్షి : ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు  నిర్మాణంలో పర్యావరణ ఆందోళన కారులకు సుప్రీంకోర్టుభారీ ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రజలకు అనుకూలంగా తీర్పిచ్చి బాంబే హైకోర్టుకు గట్టి షాకిచ్చింది. ఆరేకాలనీ లో ఇకపై చెట్లను నరకడానికి వీల్లేదని సుప్రీం సోమవారం తేల్చి చెప్పింది. తదుపరి విచారణ తేదీ అక్టోబర్‌ 21 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే  అరెస్టు చేసిన ఆందోళన కారులను తక్షణమే విడుదల చేయాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ముంబైలో మెట్రో రైలు ప్రాజెక్టు మూడో ఫేజ్‌ కోసం ఆరే కాలనీలో 2 వేల 185 చెట్లను నరికివేస్తున్న అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కానీ ఇందుకు ఆ కాలనీ వాసులు ఒప్పుకోలేదు. వారే కాదు ఎందరో సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో పార్కింగ్‌ లేకపోయినా ఫర్వాలేదు కానీ చెట్లను మాత్రం నరికేయవద్దని వేడుకున్నారు. మెట్రో నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా ఓకే చేయడంతో ధర్నాలు చేపట్టారు. ధర్నాలో బాలీవుడ్‌ నటి శ్రద్దా కపూర్‌, ఇతర నటులు కూడా పాల్గొన్నారు. బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ ట్రీ అథార్టీ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. చెట్ల నరికివేతను ఆపాలంటూ పర్యావరణ వేత్తలు వేసిన పిల్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ప్రభుత్వం తొలివిడత 400 చెట్లు నరికివేద్దామని నిర్ణయించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్క చెట్టుకూడా నరకవద్దడని బీజేపీ మినహా అన్ని పార్టీలు ఆందోళనలు నిర్వహించాయి. ట్విటర్‌లో పెద్ద ఉద్యమమే సాగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌కి కొంతమంది విద్యార్థుల బృందం లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేసు విచారణకు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ తో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తాజా ఆదేశాలిచ్చింది.