ఆరోగ్య రంగంలో కెసిఆర్‌ ముందుచూపు

ప్రాథమిక కేంద్రాల బలోపేతం: ఎమ్మెల్యే

పెద్దపల్లి,నవంబరు 26(జనం సాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఇదే విషయాన్ని

బంగ్లాదేశ్‌ వైద్య ప్రతినిధులు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. నేషనల్‌ హెల్త్‌మిషన్‌ కార్యక్రమ నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో అమలు చేస్తున్న అసంక్రమిత వ్యాధుల చికిత్సలపై అధ్యయనం చేసేందుకు బంగ్లాదేశ్‌ నుంచి వైద్య బృందం పెద్దపల్లికి వచ్చింది. ఇందులో భాగంగా పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానను బంగ్లాదేశ్‌ వైద్యులు సందర్శించి, దవాఖానలో ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో రోగులకు సరైన సమయంలో సేవలు అందిస్తున్నారని, అవుట్‌ పేషెంట్లు, ఇన్‌ పేషెంట్లకు డాక్టర్లు అందుబాటులో ఉంటూ, వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. దవాఖాన పరిసరాలను పరిశీలించి జనరల్‌ వార్డు, ఆపరేషన్‌ థియేటర్లు, ఎక్స్‌రే, పిల్లల వార్డు, ల్యాబ్‌, రక్తనిధి నిల్వ కేంద్రాల పనితీరు బాగున్నాయని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు, కేసీఆర్‌ కిట్టు, దివ్యాంగుల కోసం సదరమ్‌ క్యాంపుతోపాటు అనేక వైద్య సేవలను బంగ్లాదేశ్‌లో కూడా అమలు చేసేందుకు నివేదిక అందజేస్తామని వారు పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రాన్ని బంగ్లాదేశ్‌ వైద్య బృందం సందర్శించి ఇక్కడ ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై అధ్యయనం చేశారు. గ్రావిూణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా హైపర్‌ టెన్షన్‌ పరీక్షలు, పేషంట్ల కు అందుతున్న చికిత్స గురించి స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలోని ప్రసూతి గదితో పాటు సాధారణ వార్డులు, ల్యాబ్‌, స్టోర్‌, పరిపరాలను, రిజిస్టర్లను పరిశీలించారు. ఇది మన ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని అన్నారు. ఆరోగ్య రంగంలో సిఎం కెసిఆర్‌ ముందుచూపుతో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు.