ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ ‘ఆత్మీయ’ సమావేశం

  • సెప్టెంబర్‌ నెల జీతాలు రేపటిలోగా చెల్లించాలని ఆదేశం
  • ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు
  • సమ్మె కాలంలో జీతం చెల్లింపుకు హామీ
  • మహిళా కార్మికుల సమస్యల పరిష్కారానికి మానిటరింగ్‌ సెల్‌
  • సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగులకు రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆత్మీయ సమావేశం ముగిసింది. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్‌ కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశ అనంతరం కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని కార్మికులకు తెలియజేసేందుకే  సీఎం కేసీఆర్‌ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే కార్మికుల సమస్యలు ఏంటో నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను నేరుగా సీఎంకే వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించి తమను ఆదుకుంటానని హామీ ఇచ్చారని కార్మికులు పేర్కొన్నారు.   సెప్టెంబర్ నెలకు సంబంధించి కార్మికుల వేతనాలను డిసెంబర్ 2న చెల్లించడంతో పాటు సమ్మెకాలానికి వేతనాలు అందించేందుకు సీఎం అంగీకరించినట్లు సమాచారం. దీంతో పాటు ఆర్టీసీ మహిళా | కార్మికులకు సౌకర్యాల కల్పనతో పాటు ప్రసూతి సెలవులకు వేతనాలు ఇవ్వాలని కేసీఆర్ | నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై ప్రభుత్వానికి అధికారులకు ఈ సభ్యులు వారధిగా ఉండాలని ఆయన • సూచించినట్లు సమాచారం. కార్మికులంతా ఆర్టీసీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని.. ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలిసింది. కష్టపడి పనిచేస్తే సింగరేణిలో లాభాల బోనస్ ఎలా ఇస్తున్నామో ఆర్టీసీలోనూ దాన్ని అమలు చేస్తామని కార్మికులకు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. మహిళా ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం.. మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. అలాగే మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోపే డ్యూటీలు ఉండేలా చూడాలన్నారు. మహిళా కార్మికుల ప్రసూతి సెలవులను పెంచాలని నిర్ణయించారు. ప్రయాణికులు టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. ఇకపై కండక్టర్‌లపై కాకుండా వారిపైనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్‌.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం కార్మికులు కష్టించి పనిచేయాలని సూచించారు.