ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: కోదండరాం

బెదిరింపులు సరికావన్న జీవన్‌ రెడ్డి

కరీంనగర్‌,జూన్‌8(జనం సాక్షి ): రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనపై స్పందించిన ఆయన శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లపై చర్చించకుండా సీఎం బెదిరించడం సరికాదన్నారు. ఆర్టీసీపై డీజిల్‌ రేట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమ్మె అనివార్యమైతే ఆర్టీసీ సమ్మెకు టీజేఎస్‌ అండగా ఉంటుందని కోదండరాం స్పష్టం చేశారు.ఇదిలావుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమైతే.. ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరించడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం రాయితీలు కల్పించకుండా.. డ్రైవర్లు, కండక్టర్లను బాధ్యులను చేయడమేంటి? అని నిలదీశారు. ఆర్టీసీ దివాళా తీయడానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని జీవన్‌రెడ్డి చెప్పారు. ఆర్టీసీని కాపాడలేకుండా కార్మికులను బెదరించడం తగదన్నారు.