ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గని సిఎం కెసిఆర్‌

కొత్తగా డ్రైవర్ల,కండక్టర్ల నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌?

ఏర్పాట్లలో రవాణాశాఖ కమిషనర్‌

తార్నాక ఆస్పత్రిలో ఆరోగ్య సేవల నిలిపివేత

మండిపడుతున్న ఆర్టీసీ కార్మికులు

హైదరాబాద్‌,అక్టోబర్‌ 9 (జనం సాక్షి):  ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను డిస్మిస్‌ చేయడమే కాకుండా.. వారికి వైద్యాన్ని కూడా నిలిపివేసిన కేసీఆర్‌.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి కసరత్తు చేయాలని… అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు డ్రైవర్‌లు, కండక్టర్ల నియామకంపై.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ ఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. సిఎం సూచనలతో కొత్త కండక్టర్లు, డ్రైవర్ల నియామకానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రవాణాశాఖ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్ల నియామకానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు సూచించినట్టు సమాచారం. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నరని తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో కొత్త కార్మికుల నియామకాల ఫైల్‌ ను ప్రభుత్వానికి ఇచ్చే ఛాన్స్‌ ఉంది. రిపోర్ట్‌ ను పరిశీలించిన తర్వాత రిక్రూట్‌ మెంట్‌ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను డిస్మిస్‌ చేయడంతో.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో సిబ్బందికి వైద్యం నిలిపి వేశారు. సర్కార్‌ వైద్యం నిలిపివేయడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తార్నాక హాస్పిటల్‌ ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గవర్నర్‌ కలిసి సమ్మె గురించి వివరిస్తామని ఆర్టీసీ కార్మికులు వెల్లడించారు. పండగ వస్తుందంటే ఇంటింటా సందడే. అందునా దసరా వచ్చిందంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో మాత్రం పండగ సందడి లేదు. ఏడాదికి ఒక్కసారి వచ్చే బతుకమ్మ, దసరా పండగ రోజుల్లో చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులు చూడాల్సిన దుస్థితి ఆర్టీసీ కార్మికులకు వచ్చింది. తెలంగాణ ప్రజలంతా దసరా ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటుంటే ఆర్టీసీ కార్మిక కుటుంబాలు మాత్రం ఆవేదన, ఆందోళనతో జరుపుకున్నాయి. సమ్మె కారణంగా చేతిలో డబ్బులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలుంటాయా.. ఉడుతాయా అనే ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త బట్టలు కొనలేక, విందు వినోదాల కోలాహలం లేక కార్మిక కుటుంబాలు అల్లాడుతున్నాయి. జీతాలు లేక పోవడంతో కొత్త బట్టలు తీసుకోలేకపోయామని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. గత 30 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని అంటున్నారు.