ఆర్టీసీ సమ్మె పై కెసిఆర్‌ తీరు విడ్డూరం

జీతాలకు డబ్బుల్లేవని వరాల జల్లులా?

దిశ విషయంలో పోలీసుల తీరు గర్హనీయం: కటకం

కరీంనగర్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్‌ వ్యవహరించిన తీరు నాటి రజాకార్ల పాలనను తలపించిందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు, సంప్రదింపులతో డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సిన సీఎం 54 రోజుల సమ్మె కొనసాగడానికి, 30మంది కార్మికుల మృతికి కారకుడయ్యాన్నారు. న్యాయస్థానం ఎన్నిసార్లు సూచనలు చేసినా, హెచ్చరించినా పెడచెవిన పెట్టి అధికార మదంతో న్యాయ వ్యవస్థను అవమాన పర్చాడని అన్నారు. కార్మికుల వేతనాల కోసం రూ.48కోట్లు ఇవ్వలేమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రూ.వంద కోట్లు ఇస్తామని ప్రకటించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఆర్టీసీ డిపోలపై స్థానిక ఎమ్మెల్యేలకు పెత్తనం ఇవ్వడం అవినీతికిదారులు తెరవడమేనన్నారు. 28మంది ఇంటర్‌ విద్యార్థులు, 30మంది ఆర్టీసీ కార్మికుల మృతిలో ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని ఆరోపించారు. దిశ హత్యపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలుచేసిన ఆధునిక పోలీస్‌ వాహనాలు ప్రజల రక్షణ కోసమా లేక మంత్రులు, ఎమ్మెల్యేలకు కాపలా కాసేందుకా అని ప్రశ్నించారు. సకాలంలో పోలీసులు చేరుకొని ఉంటే దిశ అంతటి అఘాయిత్యానికి గురయ్యేదేకాదన్నారు. మహిళలపై, విద్యార్థినులపై అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు ఉండాలన్నారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పకడ్బందీగా చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.