ఆర్థిక నిర్ణయాలు భేషుగ్గా ఉన్నాయ్‌

ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి

బెంగళూరు,నవంబర్‌14(జ‌నంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ రెండో సారి అధికారంలోకి రావడం దేశానికి మంచిదని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర స్థాయిలో ఉన్న అవినీతిని నిర్మూలించేందుకు ప్రధాని మోదీ మంత్రివర్గం విశేషమైన కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో మోదీపై ఇన్ఫీ నారాయణమూర్తి ప్రశంసల జల్లు కురిపిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘దేశ ఆర్థికాభివృద్ధి సాధించేలా చేయడం కోసం ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటారు. కేంద్ర స్థాయిలో ఉన్న అవినీతిని రూపుమాపేందుకు మోదీ, ఆయన కేబినెట్‌ ఎంతో కృషి చేసింది. ఇప్పుడు అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు చాలా తక్కువగా వింటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. రఫేల్‌ ఒప్పంద వివాదం గురించి ఆయన్ను ప్రశ్నించగా.. దీనికి సంబంధించిన నిజానిజాలు తెలియనందు వల్ల దానిపై స్పందించలేదనని చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను వంటి సంస్కరణలు ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసేందుకేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటి అమలు తీరు సక్రమంగా లేకపోతే అందుకు ప్రధాని ఎంతమాత్రం బాధ్యులు కారని, అధికారులకే ఆ బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు. దేశాభివృద్ధి గురించే నిరంతరం ఆలోచించే మోదీ వంటి జాతీయ నాయకుడు ఉండటం దేశానికే మంచిదని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి క్రమశిక్షణ, పరిశుభ్రత, ఆర్థిక వృద్ధి విూద దృష్టి సారించారని ప్రశంసించారు. ఇటువంటి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం మంచి విషయమని అన్నారు.