ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు: ఎంపి రవీంద్ర బాబుపై చంద్రబాబు ఆగ్రహం

హైదరాబాద్: భారత సైనిక బలగాలపై తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమ తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పడేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. భారత రిటైర్డ్ ఆర్మీ మేజర్‌ విజయ్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఉచిత మద్యానికి, ఉచిత మాంసానికి, ఎల్‌టిసి కోసం ఆర్మీలో చేరుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.  ఆ వ్యాఖ్యల చేసినందుకు క్షమాపణ చెప్పడానికి కూడా ఆయన నిరాకరించారు. దీంతో చంద్రబాబు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులంటే తమ పార్టీ గౌరవం ఉందని ఆయన చెప్పారు. రవీంద్రబాబు వ్యాఖ్యలతో తమకు గానీ తమ పార్టీకి గానీ సంబంధం లేదని స్పష్టం చేశారు. రవీంద్ర బాబు వ్యాఖ్యలతో తమ టిడిపికి ఇబ్బందులు వస్తాయని ఆయన అన్నారు. వ్యాఖ్యలపై 24 గంటల లోపల సంజాయిషీ ఇవ్వాలని ఆయన రవీంద్ర బాబును ఆదేశించారు. మరిన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా రవీంద్రబాబు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనపై సోషల్ మీడియాలో కూడా విరుచుకుపడ్డారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తన జేబులో అగ్గిపెట్టె ఉంటుందని, తనను ఎవరు కూడా తనిఖీ చేయలేదని గతంలో పౌర విమాన యానాల మంత్రి, టిడిపి నాయకుడు అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ రవీంద్ర బాబు ఆ వ్యాఖ్యలు చేశారు. రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దేశవ్యాప్తంగా నెటిజన్లు రవీంద్రబాబుపై విరుచుకుపడ్డారు. దీంతో చంద్రబాబు స్పందించక తప్పలేదు.