ఆలేరులో అసమ్మతి నేతల సరికొత్త రాగం

సిఎం కెసిఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన

లక్ష ఓట్లతో గెలిపిస్తామని నేతల ప్రకటన

యాదాద్రికి మరింత వైభవం వస్తుందన్న ఆశాభావం

యాదాద్రి భువనగరి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో ఒక్కోచోట ఒక్కో విధంగా అసమ్మతి గళం విప్పుతోంది. యాదాద్రి జిల్లా ఆలేరులో అసంతృప్త నేతలు ఇందుకు భిన్నంగా కార్యాచరణ చేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు మళ్లీ టిక్కెట్‌ ఇవ్వడంపై సరికొత్త ఆలోచనను తెరపైకి తెచ్చారు. యాదాద్రి అభివృద్దితో ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తున్న తరుణంలో సిఎం కెసిఆర్‌ ఇక్కడి నుంచే పోటీ చేయాలని కోరుతున్నారు. తామంతా కష్టపడి లక్షకు పైగా ఓట్లతో గెలిపిస్తామని అంటున్నారు. యాదాద్రికి పేరు రావాలంటే సిఎం ఇక్కడి నుంచి పోటీ చేయడం భావ్యమని అన్నారు. ఆలేరు నియోజకవర్గ అసమ్మతి వర్గీయులు జిల్లా కేంద్రం భువనగిరి శివారులోని ఓ ¬టల్‌ సమావేశమయ్యారు. ఆలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీతను మార్చి సీఎం కేసీఆర్‌ పోటీచేయాలని కోరుతూ తీర్మానం చేశారు. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని, అదే సునీత పోటీచేస్తే ఓడిపోతుందని పేర్కొన్నారు. అనంతరం నేతలు విలేకరులతో మాట్లాడుతూ… తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆమె భర్త మహేందర్‌రెడ్డి మండల స్థాయిలో కవిూషన్ల వసూళ్లతో పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చారన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను అవమానాలకు గురి చేస్తున్నారన్నారు. పార్టీలో 80 శాతం కార్యకర్తలు, నాయకులు వీరిపై అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించి ఆలేరు నుంచి పోటీ చేయాలని కోరుతామన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ కొంతం మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎ.సంజీవరెడ్డి, బోళ్ల కొండల్‌రెడ్డి, సింగిరెడ్డి నరోత్తంరెడ్డి, వంచ వీరారెడ్డి, సుంకరి శెట్టయ్య, గట్టు నరేందర్‌, కల్గూరి మనోహర్‌రెడ్డి, శీలం రమాదేవి, బోరెడ్డి ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.