ఆవులను దత్తత తీసుకుంటే ప్రభుత్వ సన్మానం

– రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రకటన

జైపూర్‌, జనవరి14(జ‌నంసాక్షి) : వీథుల్లో తిరిగే ఆవులను దత్తత తీసుకున్నవారికి సన్మానం చేస్తామని రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ గోపాలన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపిన లేఖలో ఆవులను దత్తత తీసుకునేవారిని ప్రోత్సహించాలని ఆదేశించింది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, గోవులను ప్రేమించేవారు వీథుల్లో తిరిగే ఆవులను దత్తత తీసుకుంటే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించాలని పేర్కొంది. ప్రజల సహకారంతో గోవులను కాపాడాలన్న లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు గోపాలన్‌ డైరెక్టర్‌ విశ్రామ్‌ విూనా తెలిపారు. గోశాలల్లో ఉన్న ఆవులను దత్తత తీసుకునేవారు ఉన్నారన్నారు. వారు తమ పుట్టిన రోజులు, పెళ్ళి రోజులను ఆ ఆవులతో కలిసి జరుపుకుంటున్నారని చెప్పారు. ఇదేవిధంగా వీథుల్లో తిరిగే ఆవుల విషయంలో కూడా ప్రజలను ఆకర్షించాలని కలెక్టర్లను కోరినట్లు తెలిపారు. ఆవులను దత్తత తీసుకునేవారిని సన్మానించడంతోపాటు ధ్రువపత్రాలను కూడా ఇస్తామని చెప్పారు.